డివిలియర్స్‌ మరో ఘనత

16 Jan, 2018 16:51 IST|Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో​ ఏబీ డివిలియర్స్‌ 80 పరుగులు సాధించాడు. ఫలితంగా  సెంచూరియన్‌లో అత్యధిక టెస్టు పరుగులు నమోదు చేసిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఈ మైదానంలో  ఇప్పటివరకూ డివిలియర్స్‌ నమోదు చేసిన టెస్టు పరుగులు 1,257.  దాంతో హాషీమ్‌ ఆమ్లా(1285), జాక్వస్‌ కల్లిస్‌(1267) తర్వాత స్థానాన్ని ఏబీ ఆక్రమించాడు. మరొకవైపు ఒక వేదికలో తన అత్యధిక టెస్టు పరుగుల రికార్డును కూడా ఏబీ సవరించుకున్నాడు. ఇప్పటివరకూ కేప్‌టౌన్‌లో 1,217 టెస్టు పరుగుల్ని ఏబీ నమోదు చేయగా, తాజాగా దాన్ని అధిగమించాడు.

90/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో మంగళవారం నాల్గో రోజు ఆట కొనసాగించిన ఏబీ, ఎల్గర్‌లు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు. అయితే ఇన్నింగ్స్‌ 42 ఓవర్‌ రెండో బంతికి ఏబీని బోల్తా కొట్టించిన షమీ..46వ ఓవర్‌ ఐదో బంతికి ఎల్గర్‌ను అవుట్‌ చేశాడు. ఇక 47 ఓవర్‌ నాల్గో బంతికి డీకాక్‌ను షమీ అవుట్‌ చేశాడు. దాంతో దక్షిణాఫ్రికా 163 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది.

మరిన్ని వార్తలు