ఏడీ డివిలియర్స్‌ ‘బిగ్‌’ అరంగేట్రం

1 Oct, 2019 12:05 IST|Sakshi

కేప్‌టౌన్‌: ఇప‍్పటివరకూ పలు విదేశీ లీగ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా గ్రేట్‌ ఏబీ డివిలియర్స్‌.. ఇంకా ఆస్ట్రేలియాలో  జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో మాత్రం ఆడలేదు. ఐపీఎల్‌, సీపీఎల్‌, పీఎస్‌ఎల్‌ వంటి లీగ్‌లు ఆడిన అనుభవం ఉన్న డివిలియర్స్‌ తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 2019-20 సీజన్‌కు సంబంధించి బ్రిస్బేన్‌ హీట్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అయితే బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా సెకండ్‌ హాఫ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌తో డివిలియర్స్‌ కలుస్తాడు. దీనిపై బ్రిస్బేన్‌ హీట్‌ కోచ్‌ డారెన్‌ లీమన్‌ మాట్లాడుతూ.. ‘ ఏడి డివిలియర్స్‌ మాతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.

డివిలియర్స్‌తో కలిసి తొలిసారి పనిచేసే అవకాశం లభించింది. వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్స్‌తో కలిసి పని  చేసే అవకాశం అన్ని సందర్భాల్లోనూ రాదు. అతను 360 డిగ్రీల ఆటగాడు. అసాధారణమైన నైపుణ్యం డివీ సొంతం. ఏబీ గొప్ప నాయకుడు కూడా. బీబీఎల్‌ అనేది ప్రతీ ఒక్కరి టాలెంట్‌ వెలికి తీసే గొప్ప లీగ్‌’ అని లీమన్‌ పేర్కొన్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్‌ 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. దక్షిణాఫ్రికా తరఫున తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతల్ని డివీ సాధించాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున డివిలియర్స్‌ 442 పరుగులు చేశాడు. దాదాపు 45 సగటుతో ఈ పరుగులు నమోదు చేశాడు.ఇందులో 154 స్ట్రైక్‌ రేట్‌ ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు