‘కోహ్లి సేన నం.1 జట్టు కానే కాదు’

28 Sep, 2018 09:58 IST|Sakshi

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా క్రికెటర్లు నోటి దురుసు ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ సారి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవటం వారికి అలవాటు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌ డీన్‌ జోన్స్‌ పనికట్టుకొని టీమిండియాపై విమర్శలు చేస్తున్నాడు. కోహ్లి సేనను విమర్శిస్తునే పాకిస్తాన్‌ జట్టును పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. పాకిస్తాన్‌ జట్టుతో టీమిండియా టెస్టులు ఆడటంలేదు కాబట్టి నంబర్‌ వన్‌ జట్టు ఎలా అవుతుందని జోన్స్‌ ప్రశ్నిస్తున్నాడు.

చాంపియన్‌ జట్టంటే అన్ని జట్లతో ఆడి గెలవాలని, కానీ బలమైన పాక్‌తో తలపడితేనే కోహ్లి సేన అసలు ఆట బయటపడుతుందంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా పాకిస్తాన్‌ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఫీల్డింగ్‌ గల జట్టని అభివర్ణించాడు. అయితే జోన్స్‌కు పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ‘మీరు నోరు మూసుకుంటే మంచిది’ అంటూ నెటిజన్లు జోన్స్‌ను ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ముందు వ్యాఖ్యాతగా నిష్పక్షపాతంగా ఉండాలని కొందరు సూచించారు.  (కోహ్లిని ఎగతాళి చేస్తూ..)

గతంలో కూడా టీమిండియాపై జోన్స్‌ తన అక్కసును వెల్లగక్కాడు. పాకిస్తాన్‌లో ఆడితే ఏం చనిపోరని భారత ఆటగాళ్లను, బోర్డును అనడం అప్పట్లో వివాదస్పదమయ్యాయి. ఇక ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా రెండు రోజుల్లో హాంకాంగ్‌, పాకిస్తాన్‌ జట్లతో తలపడాల్సి వచ్చినప్పుడు బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేయగా.. వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన ఎవరూ చనిపోరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇలా అవసరం లేకున్నా టీమిండియాపై విమర్శంచిడం, వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.   

చదవండి: 
ఆ మాత్రానికే చచ్చిపోరులే: డీన్‌ జోన్స్‌

మరిన్ని వార్తలు