ఇదేం పని జోన్స్‌.. ట్రోల్‌ చేసిన ఆకాష్‌

9 Apr, 2020 10:57 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రత్యర్థి ఆటగాళ్లను దూషించడం, ఎగతాళి చేయడంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ముందు వరుసలో ఉంటారనేది జగమెరిగిన సత్యం. ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు విదేశీ ఆటగాళ్లను టార్గెట్‌ చేస్తూ హేళన చేస్తూ మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. ఆసీస్‌ మాజీ బ్యాట్స్‌మన్‌, వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ కూడా అనేక మార్లు పలువురు క్రికెటర్లను అవహేళన చేస్తూ మాట్లాడటం, ట్వీట్లు చేయడం జరిగింది. అయితే ఒకరిపై వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయన్న నానుడి డీన్‌ జోన్స్‌ విషయంలో తేటతెల్లమైంది. 

1990లలో టీమిండియాతో జరిగిన ఓ టెస్టు సందర్భంగా డీన్‌ జోన్స్‌ ఆడిన తొండటకు సంబంధించిన వీడియోను మాజీ టెస్టు ఓపెనర్‌ ఆకాష్‌ చోప్రా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసి ట్రోల్‌ చేశాడు. ఈ వీడియోలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వెంకటపతి రాజు వేసిన బంతిని జోన్స్‌ ముందుకు వచ్చి ఆడబోయాడు. అయితే బంతి బ్యాట్‌కు తగలకుండా బ్యాట్స్‌మన్‌ ప్యాడ్స్‌కు తగిలి నెమ్మదిగా కీపర్‌ వైపు వెళ్లింది. అయితే వెంటనే డీన్‌ జోన్స్‌ ఆ బంతిని చేతితో అడ్డుకుని బౌలర్‌వైపు విసిరాడు. ఈ విషయాన్ని గమనించిన భారత కీపర్‌ అంపైర్‌ వైపు అసహనంగా చూశాడు. కానీ అంపైర్‌తో సహా అందరూ బంతి బ్యాట్‌/కాలికి తగిలి బౌలర్‌ వైపు వచ్చింది అనుకున్నారు. కానీ రిప్లైలో చూస్తే జోన్స్‌ బంతిని చేతితో విసిరినట్టు తేలింది. 

అయితే ఈ వీడియోను ఆకాష్‌ చోప్రా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘బంతిని చేతితో అడ్డుకొని ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించారు. మీరు అక్కడ ఏం చేశారు? దీనిని నుంచి ఎలా బయటపడ్డారు’అనే కామెంట్‌ను జతచేశాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తొండాట ఆడటం ఆసీస్‌ క్రికెటర్లకే సాధ్యమని.. అది కచ్చితంగా అవుటేనని పేర్కొన్న నెటిజన్లు ఇదేం పని జోన్స్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై డీన్‌ జోన్స్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

చదవండి:
డీన్‌ జోన్స్‌కు పార్థీవ్‌ అదిరిపోయే పంచ్‌
‘మనసులో మాట.. ఆల్‌రౌండర్‌గా మారాలి’

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా