హైదరాబాద్‌ బౌలర్లు విఫలం

8 Dec, 2018 10:06 IST|Sakshi

 అజయ్‌ రొహెరా డబుల్‌ సెంచరీ

 యశ్‌ దూబే అజేయ శతకం

 మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 539/4

 రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌ జట్టుతో జరుగుతోన్న ఎలైట్‌ గ్రూప్‌ ఎ అండ్‌ బి లీగ్‌ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో తక్కువ స్కోరుకే ఆలౌటైన హైదరాబాద్‌ను బౌలర్లూ ఆదుకోలేకపోయారు. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఆతిథ్య మధ్యప్రదేశ్‌ భారీస్కోరు సాధించింది. శుక్రవారం రెండోరోజు ఆటలో హైదరాబాద్‌ బౌలర్లు కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. దీంతో ఓవర్‌నైట్‌ స్కోరు 168/1తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన మధ్యప్రదేశ్‌ రెండోరోజు ఆటముగిసే సమయానికి 136 ఓవర్లలో 4 వికెట్లకు 539 పరుగుల భారీస్కోరు చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ అజయ్‌ రొహెరా (331 బంతుల్లో 255 బ్యాటింగ్‌; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. అజయ్‌కి తోడు యశ్‌ దూబే (219 బంతుల్లో 128 బ్యాటింగ్‌; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా అజేయ శతకంతో చెలరేగడంతో హైదరాబాద్‌ భారీ ఆధిక్యాన్ని కోల్పోయింది. మధ్యప్రదేశ్‌ ప్రస్తుతం 415 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. హైదరాబాద్‌ బౌలర్లలో రవికిరణ్‌ 2 వికెట్లు పడగొట్టగా... ముదస్సర్, తనయ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.  

రెండోరోజూ అజయ్‌ దూకుడు

తొలిరోజు ఆటలో హైదరాబాద్‌ బౌలర్లను విసిగించిన అజయ్‌ రొహెరా, రజత్‌ పటీదార్‌ (51; 7 ఫోర్లు) జోడీని ముదస్సర్‌ ఆట ప్రారంభంలోనే విడదీశాడు. రజత్‌ క్రితం రోజు స్కోరు వద్దే ముదస్సర్‌ బౌలింగ్‌లో సుమంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కెప్టెన్‌ నమన్‌ ఓజా (72 బంతుల్లో 28; 3 ఫోర్లు) సహాయంతో అజయ్‌ 138 బంతుల్లో సెంచరీని చేరుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగించిన అజయ్‌ బౌండరీలతో హైదరాబాద్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. లంచ్‌ విరామానికి ముందు బంతిని అందుకున్న రవికిరణ్‌ తన పేస్‌ పదును చూపించాడు. 16 పరుగుల వ్యవధిలో నమన్‌ ఓజా, శుభమ్‌ శర్మ (13; 3 ఫోర్లు) వికెట్లు తీసి హైదరాబాద్‌ శిబిరంలో ఆనందం నింపాడు. అయితే లంచ్‌ తర్వాత హైదరాబాద్‌ బౌలర్ల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.

అజయ్‌తో జతకలిసిన యశ్‌ దూబే ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అజయ్‌ 210 బంతుల్లో 150 పరుగుల మార్కును చేరుకోగా.. యశ్‌ 104 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకు న్నాడు. దీంతో మధ్యప్రదేశ్‌ 396/4 స్కోరుతో టీ విరామానికెళ్లింది. టీ తర్వాత ధాటిగా ఆడిన అజయ్‌... తనయ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో డబుల్‌ సెంచరీని అందుకున్నాడు. 150 పరుగుల నుంచి 200 స్కోరును చేరుకోవడానికి 68 బంతుల్ని తీసుకున్న అతను, 250 పరుగుల మార్కును అందుకోవడానికి కేవలం 52 బంతులే ఆడాడు. మరోవైపు యశ్‌ దూబే కూడా 197 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడంతో మధ్యప్రదేశ్‌ భారీ స్కోరు సాధించింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 261 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్‌గా వచ్చి తొలిరోజు మొత్తం క్రీజులో గడిపిన అజయ్‌... రెండోరోజూ చివరిదాకా నిలిచి హైదరాబాద్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.  


స్కోరు వివరాలు

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 124 ఆలౌట్‌. మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: ఆర్యమన్‌ విక్రమ్‌ బిర్లా (బి) తనయ్‌ త్యాగరాజన్‌ 32; అజయ్‌ రొహెరా (బ్యాటింగ్‌) 255; రజత్‌ పటీదార్‌ (సి) సుమంత్‌ (బి) ముదస్సర్‌ 51; నమన్‌ ఓజా (సి) తనయ్‌ త్యాగరాజన్‌ (బి) రవిరకిరణ్‌ 28; శుభమ్‌ శర్మ ఎల్బీడబ్ల్యూ (బి) రవికిరణ్‌ 13; యశ్‌ దూబే (బ్యాటింగ్‌) 128, ఎక్స్‌ట్రాలు 32; మొత్తం (136 ఓవర్లలో 4 వికెట్లకు) 539.

వికెట్ల పతనం: 1–68, 2–181, 3–262, 4–278.

బౌలింగ్‌: రవికిరణ్‌ 30–3–103–2, ముద స్సర్‌ 20–3–102–1, రవితేజ 22–1–92–0, తనయ్‌ త్యాగరాజన్‌ 33–4–110–1, మెహిదీహసన్‌ 25–1–75–0, కె. రోహిత్‌ రాయుడు 2–0–14–0, బి. సందీప్‌ 2–0– 10–0, తన్మయ్‌ అగర్వాల్‌ 2–0–10–0. 

మరిన్ని వార్తలు