దీప అదృష్టం అక్కడే తారుమారు..

15 Aug, 2016 13:06 IST|Sakshi
దీప అదృష్టం అక్కడే తారుమారు..

రియో డీ జనీరో: దీపా కర్మాకర్.. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్. అంతేకాకుండా రియోలో ప్రొడునోవా వాల్ట్ విభాగంలో తుది పోరుకు అర్హత సాధించి సరికొత్త చరిత్రను కూడా లిఖించింది. అయితే భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో దీపా నాల్గో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. కాగా, దీపను పాయింట్ల పరంగా వెనుక్క నెట్టింది మాత్రం సిమోన్ బైల్స్ (అమెరికా-15.966 పాయింట్లు), మరియా పాసెకా (రష్యా-15.253 పాయింట్లు)లు మాత్రమే. ఫైనల్ పోరులో భాగంగా వరల్డ్ టాప్ జిమ్నాస్ట్లైన  బైల్స్, పాసెకాలు  చివర్లో బరిలోకి దిగి దీప ఆశలను నీరుగార్చారు.

క్వాలిఫికేషన్ రౌండ్లో టాప్-8కు అర్హత సాధించిన వారు ఫైనల్ పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో దీపా ఆరో స్థానంలో బరిలోకి దిగింది. తొలి ప్రయత్నంలో14.866 పాయింట్లుసాధించిన దీప... రెండో ప్రయత్నంలో 15.266 పాయింట్లు సంపాదించింది.  దీంతో ఓవరాల్  సగటు 15.066 పాయింట్లగా నమోదైంది.  దీంతో దీప తన రౌండ్ ను ముగించిన తరువాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి  పతకంపై ఆశలు రేపింది. కాగా, చివర్లో పాసికా, బైల్స్లు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో దీపా అనూహ్యంగా వెనక్కిపడిపోయింది. అయినప్పటికీ యావత్ భారతావని మనసును మాత్రం గెలుచుకుంది. కష్టసాధ్యమైన ప్రొడునోవాలో ముందుకు వెళ్లడమే తలకు మించిన భారం. మరి అటువంటింది 'టాప్' జిమ్నాస్ట్ల చేతిలో ఓడిపోయిన దీపది కచ్చితంగా అత్యుత్తమ ప్రదర్శనే కదా.ప్రస్తుతం భారత్ లో దీప ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురవడమే ఆమె పోరాట స్ఫూర్తికి నిదర్శనం.

>
మరిన్ని వార్తలు