త్రుటిలో చేజారిన పతకం

15 Aug, 2016 03:09 IST|Sakshi
త్రుటిలో చేజారిన పతకం

 జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు నాలుగో స్థానం
 రియో డి జనీరో: ప్రమాదకర విన్యాసం ప్రోడునోవా చేసినప్పటికీ... భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. రియో ఒలింపిక్స్‌లో ఆదివారం జరిగిన మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్ ఈవెంట్‌లో దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. తొలి ప్రయత్నంలో దీపా 14.866 పాయింట్లు... రెండో ప్రయత్నంలో 15.266 పాయింట్లు సంపాదించింది. ఈ రెండు ప్రయత్నాల స్కోర్లను కలిపి సగటు తీయగా...
 
 దీపా కర్మాకర్ 15.066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. సిమోన్ బైల్స్ (అమెరికా-15.966 పాయింట్లు) స్వర్ణం సొంతం చేసుకోగా... మరియా పాసెకా (రష్యా-15.253 పాయింట్లు) రజతం... గిలియా స్టింగ్‌రూబెర్ (స్విట్జర్లాండ్-15.216 పాయింట్లు) కాంస్య పతకం గెలిచారు. మొత్తం ఎనిమిది మంది జిమ్నాస్ట్‌లు ఫైనల్లో తలపడ్డారు. అందరికీ రెండేసి అవకాశాలు ఇచ్చారు. వరుసగా ఏడో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ 41 ఏళ్ల ఒక్సానా చుసోవితినా (ఉజ్బెకిస్తాన్-14.833 పాయింట్లు) ఏడో స్థానంతో సంతృప్తి పడింది.

మరిన్ని వార్తలు