దీపా మలిక్‌ అప్పీల్‌...

19 Aug, 2017 00:50 IST|Sakshi
దీపా మలిక్‌ అప్పీల్‌...

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తన పేరును ఖేల్‌రత్న అవార్డు కోసం మరోసారి పరిశీలించాలంటూ పారాలింపియన్‌ దీపా మలిక్‌ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఒలింపిక్స్‌ జరిగిన ఏడాది ఎక్కవ మందికి ఈ అవార్డు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తాను మళ్లీ అప్పీల్‌ చేస్తున్నట్లు ఆమె చెప్పింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కూడా ఆమెకు మద్దతుగా కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటి వరకైతే అవార్డుల కమిటీ ఇచ్చిన జాబితాకు కేంద్ర క్రీడా శాఖ ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. అయితే దీప పేరును పరిశీలించే అవకాశం లేదని కమిటీలో ఒక సభ్యుడు వెల్లడించినట్లు సమాచారం.

రియోలో పతకం సాధించిన పారాలింపియన్లు అందరికీ అవార్డు ఇవ్వలేమని చెప్పిన ఆయన, దేవేంద్ర జజరియాకు ఇది రెండో ఒలింపిక్‌ స్వర్ణమనే విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు తమకు శిక్షణ ఇచ్చారంటూ ఒకరికంటే ఎక్కువ మంది కోచ్‌ల పేర్లను ద్రోణాచార్య అవార్డుకు సిఫారసు చేసే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాక్సర్‌ అఖిల్‌ కుమార్‌ అభిప్రాయపడ్డాడు. వారిపై 420 కేసు పెట్టాలని అతను ఘాటుగా వ్యాఖ్యానించాడు. మహిళల బాక్సింగ్‌లో ముగ్గురు అర్జున అవార్డీలు ఉండగా, ఐదుగురు ద్రోణాచార్యలు ఎలా ఉంటారని అతను ప్రశ్నించాడు.   

మారాల్సిందే..
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖేల్‌రత్న అవార్డును  అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఒక్క ఆటగాడికి మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఇది ముగ్గురు, నలుగురికి ఇస్తున్నారు. మున్ముందు ఆరుగురి దాకా వెళుతుందేమో? గడువు ముగిసిన తర్వాత కూడా ఆటగాళ్ల పేర్లను సిఫారసు చేయడాన్ని క్రీడా శాఖ మానుకోవాలి. 1960 నుంచి 1980 దశకం వరకు అర్జున అవార్డు విజేతలు వీటిని చాలా గొప్పగా భావించేవారు. ఇప్పటి పరిస్థితుల్లో అర్జున, ద్రోణాచార్య అవార్డులకు విలువ లేకుండా పోయింది. త్వరలోనే ఖేల్‌రత్న కూడా ఇదే ఒరవడిలోకి వస్తుందేమో.

‘తమ’వారికి సడలింపులు
2003లో ఖేల్‌రత్న కోసం ముందుగా అంజూ బాబీ జార్జి ఎంపికయ్యింది. అయితే డబుల్‌ ట్రాప్‌ షూటర్‌ రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో దేశం నుంచి తొలి వ్యక్తిగత రజతం సాధించడంతో అంజూకు బదులు రాథోడ్‌కు ఈ అవార్డు ఇచ్చారు. నిజానికి నాలుగేళ్ల కోసారి జూలై–ఆగస్టు మధ్య ఒలింపిక్స్‌ జరుగుతాయి. అయితే అప్పటికే జాతీయ క్రీడా అవార్డుల ప్రతిపాదన గడువు కూడా ముగుస్తుంది. కానీ ప్రభుత్వం అత్యుత్సాహంతో నిబంధనలను పక్కనబెట్టి రాథోడ్‌కు ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాదికి అంజూను ఎంపిక చేశారు. తదనంతరం కూడా ఇలాంటి వ్యవహారాలు జరిగాయి. 

మరిన్ని వార్తలు