పాపం దీపక్‌.. పసిడి పోరును వద్దనుకున్నాడు

22 Sep, 2019 14:20 IST|Sakshi

నూర్‌ సుల్తాన్‌(కజికిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి భారత స్టార్‌ రెజ్లర్‌ దీపక్‌ పూనియా వైదొలిగాడు. గాయం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడకుండానే నిష్క్రమించాడు. ఎడమకాలికి గాయం కారణంగా పసిడి పోరు నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. దాంతో రజతంతోనే సరిపెట్టుకున్నాడు. 86 కేజీల ఫ్రీస్టైయిల్‌ కేటగిరీలో హసన్‌ యజ్‌దాని(ఇరాన్‌)తో తలపడాల్సి ఉండగా గాయం వేధించింది. ఇక చేసేది లేక ఫైనల్‌ బౌట్‌ను ఆడలేనని నిర్వాకులకు స్పష్టం చేశాడు.  ఫలితంగా యజ్‌దానికి స్వర్ణం లభించగా, దీపక్‌ పూనియా రన్నరప్‌గా నిలిచాడు.

దీనిపై దీపక్‌ పూనియా మాట్లాడుతూ.. ‘ నేను స్వర్ణ పతకం కోసం ఫైట్‌ చేయలేకపోవడం చాలా నిరాశకు గురి చేసింది. ఓవరాల్‌గా నా ప్రదర్శన బాగున్నా, టైటిల్‌ ఫైట్‌ను కోల్పోయాను. నా ఎడమ కాలు బాగా బాధించింది. దానిపై ఎక్కువ ఒత్తిడి పడితే ఆ గాయం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాలి గాయంతో రెజ్లింగ్‌ బౌట్‌లో పాల్గొనడంలో చాలా కష్టం. యజ్‌దానితో తుది పోరులో తలపడే అవకాశం నా ముందున్నా ఏమీ చేయలేని పరిస్థితి నాది. ఇక ఒలింపిక్స్‌ పతకం సాధించడంపై దృష్టి సారిస్తున్నా’ అని దీపక్‌ పూనియా పేర్కొన్నాడు.

శనివారం ఏకపక్షంగా సాగిన సెమీస్‌ పోరులో 20 ఏళ్ల దీపక్‌ 8–2 తేడాతో స్టెఫాన్‌ రీచ్‌మత్‌ (స్విట్జర్లాండ్‌)ను చిత్తు చేశాడు. అంతకుముందు సెమీస్‌ చేరడంతోనే దీపక్‌ వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. మూడేళ్ల క్రితం తొలిసారి వరల్డ్‌ క్యాడెట్‌ టైటిల్‌ గెలుచుకొని వెలుగులోకి వచ్చిన దీపక్‌ ఆ తర్వాత నిలకడగా విజయాలు సాధించాడు. గత నెలలో జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌గా నిలవడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అతనికి ప్రత్యర్థి నుంచి ఎలాంటి పోటీ ఎదురు కాలేదు.

మరిన్ని వార్తలు