దీపక్‌ ‘టాప్‌’ లేపాడు..

27 Sep, 2019 13:04 IST|Sakshi

స్విట్జర్లాండ్‌: ఇటీవల ముగిసిన వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత రెజ్లర్‌ దీపక్‌ పూనియా.. తాజాగా యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌(యుడబ్యూడబ్యూ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు. తన 86 కేజీల కేటగిరీలో దీపక్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 20 ఏళ్ల దీపక్‌ 82 పాయింట్లతో టాప్‌కు ఎగబాకాడు. అదే సమయంలో మాజీ వరల్డ్‌ చాంపియన్‌ యజ్‌దానిని వెనక్కి నెట్టాడు. ప్రస్తుత యజ్‌దాని 78 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది యాసర్‌ దోగు చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన దీపక్‌.. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం దక్కించుకున్నాడు.

వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన దీపక్‌ గాయం కారణంగా తుది బౌట్‌లో పాల్గొనలేదు. దాంతో రజతంతోనే సంతృప్తి పడ్డాడు. నిలకడగా రాణిస్తున్న దీపక్‌ తన పాయింట్లను మెరుగుపరుచుకుంటూ ప్రథమ స్థానానికి ఎగబాకాడు. వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన మరో భారత రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా తన 65 కేజీల కేటగిరీలో టాప్‌ ర్యాంకును కోల్పోయాడు. ఈ విభాగంలో వరల్డ్‌ రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన రష్యన్‌ రెజ్లర్‌ రషిదోవ్‌ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. మహిళల రెజ్లింగ్‌ ర్యాంకింగ్స్‌లో భాగంగా 53 కేజీల కేటగిరీలో వినేశ్‌ ఫొగట్‌ రెండో స్థానాన్ని ఆక్రమించారు. వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన ఫొగట్‌.. నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరారు.

మరిన్ని వార్తలు