మనవాళ్ల ప్రదర్శన సంతృప్తినిచ్చింది

15 Nov, 2018 10:07 IST|Sakshi

జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌

ముంబై: భారత బ్యాడ్మింటన్‌కు ఈ ఏడాది క్లిష్టంగా గడిచిందని జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డారు. కఠిన పరిస్థితుల్లోనూ భారత క్రీడాకారుల ప్రదర్శన సంతృప్తినిచ్చిందని అన్నారు. అనుకూల పరిస్థితుల్లోనూ మన ప్లేయర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారని కితాబిచ్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించిన నగర స్థాయి మల్టీ స్పోర్ట్స్‌ ఫ్రాంచైజీ ‘ముంబై గేమ్స్‌’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పుల్లెల గోపీచంద్‌ భారత బ్యాడ్మింటన్‌ క్రీడ ప్రస్తుత స్థితిగతులపై మాట్లాడారు. ‘బ్యాడ్మింటన్‌కు ఈ ఏడాది చాలా క్లిష్టంగా గడించింది. అయినప్పటికీ చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇంత కఠిన పరిస్థితుల్లో మన క్రీడాకారులు గొప్పగా ఆడారు. సింధు, శ్రీకాంత్‌ తమ స్థాయి నిలబెట్టుకుంటూ టాప్‌–10 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఇదే ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌ లాంటి మూడు మెగా ఈవెంట్‌లు జరిగాయి.

ఇందులో పతకం సాధించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ మా వద్ద అంత సమయం లేదు. ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకుంటూ ఈ మూడు పెద్ద ఈవెంట్‌లలోనూ పతకాలు సాధించాలన్నదే మా లక్ష్యంగా ఈ ఏడాది బరిలో దిగాం. అనుకున్నది సాధించాం. ఇక వచ్చే ఏడాది కోసం ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంది’ అని వివరించారు. తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్‌ దొరకడం లేదని అన్నారు. ముఖ్యమైన టోర్నీలో దీని ప్రభావం కనబడుతుందని చెప్పారు. ప్రాక్టీస్‌లోనే ప్రతీ ప్లేయర్‌ తమ తప్పిదాలను సరిదిద్దుకుంటాడని వివరించారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం చాలా మెరుగవ్వాల్సి ఉంది. శ్రీకాంత్‌నే చూసుకుంటే అతను ఈ మధ్య ఇద్దరి చేతుల్లోనే ఎక్కువగా ఓడిపోతున్నాడు. ఎక్కడ పొరపాటు జరుగుతుందో చూసి వారిపై గెలిచేలా మేం తయారవ్వాలి. వెంటవెంటనే టోర్నమెంట్‌లలో పాల్గొనాల్సి రావడంతో సరైన ప్రాక్టీస్‌ లేకుండా పోతోంది’ అని గోపీచంద్‌ వివరించారు.    

మరిన్ని వార్తలు