రెండో రోజు విదర్భ జోరు

5 Feb, 2019 01:29 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో 312 ఆలౌట్‌

సౌరాష్ట్ర 158/5

రంజీ ట్రోఫీ ఫైనల్‌  

నాగ్‌పూర్‌: రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భ పడి...లేచింది. రెండో రోజు ఇటు పరుగులతో అటు వికెట్లతో పట్టుబిగించింది. సౌరాష్ట్రను కష్టాల్లో పడేసింది. స్పిన్నర్లు ఆదిత్య సర్వతే (3/55), అక్షయ్‌ వఖారే (2/42) ప్రత్యర్థి టాపార్డర్‌ను తమ మాయలో పడేశారు. వఖారే ముందుగా బ్యాట్‌తో, తర్వాత బౌలింగ్‌తో విదర్భ జోరుకు ఊపిరిపోశాడు. సౌరాష్ట్ర కష్టాలు పెంచాడు. రెండో రోజు 200/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం ఆట కొనసాగించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగుల వద్ద ఆలౌటైంది. చేతిలో ఉన్న టెయిలెండర్లతోనే ఏకంగా 112 పరుగులు జతచేసింది విదర్భ.

ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ అక్షయ్‌ కర్నేవార్‌ (73 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), వఖారే (34; 3 ఫోర్లు) తొలి సెషనంతా మొండిగా పోరాడారు. ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. వఖారే నిష్క్రమణ తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ (13), గుర్బానీ (6)ల అండతో కర్నేవార్‌ జట్టు స్కోరును 300 దాటించాడు. ఉనాద్కట్‌ 3, చేతన్‌ సాకరియా, కమలేశ్‌ మక్వానా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన సౌరాష్ట్రను స్పిన్నర్లు ఆదిత్య సర్వతే, వఖారే ఉక్కిరిబిక్కిరి చేశారు.

దీంతో ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్నెల్‌ పటేల్‌ (87 బ్యాటింగ్‌; 14 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కీలక బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా (1) సహా, మరో ఓపెనర్‌ హార్విక్‌ దేశాయ్‌ (10), విశ్వరాజ్‌ జడేజా (18), అర్పిత్‌ (13),  షెల్డన్‌ జాక్సన్‌ (9) ప్రత్యర్థి స్పిన్‌ ఉచ్చులో చిక్కుకున్నారు. దీంతో సౌరాష్ట్ర 131 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి స్నెల్‌ పటేల్‌తో పాటు ప్రేరక్‌ మన్కడ్‌ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. సౌరాష్ట్ర ఇంకా 154 పరుగుల వెనుకంజలో ఉంది.   

>
మరిన్ని వార్తలు