డిఫెండింగ్‌ కాదు.. ‘డీలా’ చాంపియన్స్‌

28 Jun, 2018 12:15 IST|Sakshi
జర్మనీ ఓటమితో నిరాశలో ఫ్యాన్స్‌

ఏ మెగా టోర్నీలోనైనా డిఫెండింగ్‌ చాంపియన్‌ అనేది హాట్‌ ఫేవరేట్‌గా ఉండటం సహజం. అభిమానుల అంచనాలు కూడా ఆ జట్టుపైనే ఎక్కువగా ఉంటాయి. ‘ఏదో అన్నీ కలిసొచ్చి టైటిల్‌ నెగ్గారు.. దమ్ముంటే ఈసారి కప్‌ గెలవండి’ అనే విమర్శకుల నోళ్లు మూయించడానికైనా ఆయా జట్లు విశ్వప్రయత్నాలు చేస్తుంటాయి. అయితే ఫిఫా ప్రపంచ కప్‌లలో మాత్రం​ డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ఆశ్చర్యకర రీతిలో లీగ్‌దశ నుంచే నిష్క్రమిస్తున్నాయి. ఆ చరిత్ర ఓసారి పరిశీలిస్తే... 

‘2002లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ లీగ్‌ దశలోనే ఇంటి ముఖం పట్టింది. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన సాకర్‌ సమరంలో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇటలీ కూడా లీగ్‌ స్టేజీని దాటలేకపోయింది. 2014లో బ్రెజిల్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ను మరోసారి ముద్దాడాలనుకున్న స్పెయిన్‌ లీగ్‌ దశలోనే పోరాటం ముగించింది. ఇప్పుడు తాజాగా రష్యాలో జరుగుతున్న సాకర్‌ సమరంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీ కూడా నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించింది. 

ఈ ప్రపంచ కప్‌లో బలమైన జట్టుగా పేరున్న జర్మనీ.. కలలో కూడా ఊహించని పరిణామం ఎదుర్కొంది. పసికూన దక్షిణ కొరియా చేతిలో ఘోర పరాభావం చవిచూసింది. దీంతో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ హోదాలో బరిలోకి దిగే ఏ జట్టైనా లీగ్‌ దశలోనే నిష్క్రమిస్తుందని ఓ అపనమ్మకం అభిమానుల్లో ఏర్పడింది. మరి 2022లో ఖతార్‌లో జరిగే ప్రపంచ కప్‌లో నైనా ఈ సాంప్రదాయానికి తెరపడుతుందో చూడాలి.


 

మరిన్ని వార్తలు