సన్‌డే స్ట్రోక్‌

15 Apr, 2019 04:31 IST|Sakshi

సొంతగడ్డపై హైదరాబాద్‌ చిత్తు

39 పరుగులతో ఢిల్లీ ఘన విజయం 

క్యాపిటల్స్‌ను గెలిపించిన బౌలర్లు 

వార్నర్‌ అర్ధసెంచరీ వృథా   

సన్‌రైజర్స్‌ విజయానికి నాలుగు ఓవర్లలో 52 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. తాజా సీజన్‌లో ఇలాంటి లక్ష్యాన్ని వివిధ జట్లు తరచుగా ఛేదిస్తుండటం, వార్నర్‌ క్రీజ్‌లో ఉండటంతో రైజర్స్‌కు గెలుపుపై ఆశలు ఉన్నాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్ల ముందు సన్‌కు భారీ స్ట్రోక్‌ తగిలింది.

వరుస బంతుల్లో వార్నర్, విజయ్‌లను రబడ ఔట్‌ చేయగా... తర్వాతి ఓవర్లో మోరిస్‌ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టడంతో జట్టు ఓటమి దిశగా పయనించింది. ఐపీఎల్‌లో తమ 100వ మ్యాచ్‌ ఆడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 15 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోయి మరో 13 బంతులు మిగిలి ఉండగానే అనూహ్యంగా ఆలౌట్‌ కావడం పెద్ద షాక్‌! 

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ పరాజయాలు నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 39 పరుగుల తేడాతో రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 45; 5 ఫోర్లు), కొలిన్‌ మున్రో (24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఖలీల్‌ అహ్మద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. వార్నర్‌ (47 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) బెయిర్‌స్టో (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించినా... ఇతర బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం సన్‌ను ఘోరంగా దెబ్బ తీసింది. రబడ 4 వికెట్లు పడగొట్టగా, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కీమో పాల్, మోరిస్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.  

మున్రో వల్లే... 
ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు ఈ మాత్రమైనా వచ్చిందంటే మున్రోనే కారణం. ఖలీల్‌ చక్కటి బౌలింగ్‌కు ఓపెనర్లు పృథ్వీ షా (4), ధావన్‌ (7) వెనుదిరిగిన తర్వాత ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న మున్రో దూకుడైన ఆటను ప్రదర్శించాడు. సందీప్‌ తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను... ఖలీల్‌ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అభిషేక్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టిన మున్రో తర్వాతి బంతికే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  

ఇద్దరూ అంతంతే... 
క్రీజ్‌లో ఇద్దరు హార్డ్‌ హిట్టర్లు శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్‌ (19 బంతుల్లో 23; 3 ఫోర్లు) ఉన్నారు... వీరిద్దరే మూడో వికెట్‌కు అతి కష్టమ్మీద 56 పరుగులు జోడించేందుకు 47 బంతులు తీసుకున్నారు. వీరి భాగస్వామ్యంలో కేవలం ఆరు ఫోర్లే వచ్చాయి. ఇన్నింగ్స్‌ కీలక దశలో ఢిల్లీ బ్యాటింగ్‌ ఎలా సాగిందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. సన్‌రైజర్స్‌ బౌలర్లు పట్టు బిగించడంతో ఢిల్లీ పరుగులు చేయడమే గగనంగా మారిపోయింది. అయ్యర్, పంత్‌ చెత్త షాట్లతో నాలుగు బంతుల వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత స్కోరు వేగం ఆగిపోయింది. చివరి 5 ఓవర్లలో క్యాపిటల్స్‌ 4 వికెట్లు కోల్పోయి 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. నబీ స్థానంలో వచ్చిన విలియమ్సన్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా... యూసుఫ్‌ పఠాన్, మనీశ్‌ పాండే, కౌల్‌ స్థానాల్లో రికీ భుయ్, అభిషేక్, ఖలీల్‌ అహ్మద్‌లకు అవకాశం దక్కింది.  

శుభారంభం... 
సీజన్‌లో మరోసారి బెయిర్‌స్టో, వార్నర్‌ జోడీ హైదరాబాద్‌కు చక్కటి ఆరంభాన్ని అందించింది. రబడ ఓవర్లో ఇద్దరూ చెరో ఫోర్‌ కొట్టగా, ఇషాంత్‌ వేసిన తర్వాతి ఓవర్లో బెయిర్‌స్టో మరో రెండు ఫోర్లు బాదాడు. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 40 పరుగులకు చేరింది. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 72 పరుగులు జోడించిన అనంతరం బెయిర్‌స్టో వెనుదిరిగాడు. రబడ అద్భుత క్యాచ్‌కు విలియమ్సన్‌ (3) ఔట్‌ కాగా... తొలి మ్యాచ్‌ ఆడుతున్న రికీ భుయ్‌ (7) విఫలమయ్యాడు. పరుగులు రావడం కష్టంగా మారిపోగా, చేయాల్సిన రన్‌రేట్‌ కూడా పెరిగిపోవడంతో హైదరాబాద్‌పై తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌ను, తర్వాతి బంతికి విజయ్‌ శంకర్‌ (1)ను రబడ ఔట్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ విజయంపై ఆశలు వదిలేసుకుంది.

మరిన్ని వార్తలు