ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ!

7 Mar, 2020 11:49 IST|Sakshi

న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ ఆరంభం కానున్న తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో​ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనబడుతున్నాయి.. ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఐపీఎల్‌కు దూరమయ్యే యోచనలో ఉన్నాడు. సమ్మర్‌లో తన అంతర్జాతీయ కెరీర్‌ను ఫ్రెష్‌గా ఆరంభించాలనుకుంటున్న వోక్స్‌ ఐపీఎల్‌ నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వోక్స్‌ సదరు ఫ్రాంచైజీకి ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది. వోక్స్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఢిల్లీ పరిశీలిస్తునట్లు సమచారం. ఈ సీజన్‌ ఐపీఎల్‌ వేలంలో కోటి యాభై లక్షలకు వోక్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. 

ఇప్పటికే ఢిల్లీ పేసర్లు కగిసో రబడా, ఇషాంత్‌ శర్మలు గాయాలు బారిన పడటంతో ఆ జట్టు సతమవుతుండగా, వోక్స్‌ వైదొలగడం ఖాయమైతే మాత్రం అది గట్టి ఎదురుదెబ్బ. ప్రస్తుతం గాయం కారణంగా రబడా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకవేళ తాను ఫిట్‌ అయితే ఐపీఎల్‌కు అందుబాటులోకి వస్తానని చెబుతున్నప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చు. సుదీర్ఘ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిండంతో ఐపీఎల్‌లో రబడా ఆడటం అనుమానమే. ఇక ఇషాంత్‌ శర్మ కూడా గాయపడ్డాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో ఇషాంత్‌ గాయపడ్డాడు. ఐపీఎల్‌ ఆరంభ సమయానికి ఇషాంత్‌ కోలుకుంటాడని ఢిల్లీ ఆశాభావంతో ఉంది. ఈ తరుణంలో వోక్స్‌ హ్యాండిస్తే మాత్రం ఢిల్లీ పేస్‌ బౌలింగ్‌ విభాగం బలహీనం కావొచ్చు. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు వోక్స్‌ ఆడగా, ఈసారి వోక్స్‌ను ఢిల్లీ తీసుకుంది. శ్రీలంక పర్యటనకు వెళ్లే ఇంగ్లండ్‌ జట్టులో వోక్స్‌ సభ్యుడిగా ఉన్నాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మార్చి 19వ తేదీన ఇంగ్లండ్‌-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. 

మరిన్ని వార్తలు