ఢిల్లీ కోచ్‌గా కిర్‌స్టెన్

4 Sep, 2013 01:42 IST|Sakshi

 హైదరాబాద్: ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమవుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ ఏడో సీజన్ కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను తమ చీఫ్ కోచ్‌గా నియమించుకుంది. అసిస్టెంట్ కోచ్‌గా ఎరిక్ సిమన్స్, మెంటర్‌గా టీఏ శేఖర్ కొనసాగుతున్నారు. పాక్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ మరోసారి స్పిన్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఐపీఎల్-6లో ఢిల్లీ జట్టు ఎనిమిదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తన పాత స్నేహితుడు సిమన్స్ చీఫ్ కోచ్ పదవిని స్వీకరించాల్సిందిగా కోరాడని గ్యారీ చెప్పారు. భారత జట్టు కోచ్‌గా కిర్‌స్టెన్ 2011 వన్డే ప్రపంచకప్ టైటిల్‌తో పాటు టెస్టుల్లో నంబర్‌వన్ స్థానం సంపాదించి పెట్టారు.
 
 అరుదైన నైపుణ్యం కోహ్లి సొంతం
 భారత జట్టు భవిష్యత్ కెప్టెన్‌గా భావిస్తున్న విరాట్ కోహ్లి చాలా గొప్ప క్రికెటర్ అవుతాడని కిర్‌స్టెన్ కితాబిచ్చారు. ‘కోహ్లి అంటే నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. అతనిలో అరుదైన నైపుణ్యం ఉంది. రాబోయే రోజుల్లో గొప్ప ప్లేయర్‌గా పరిణతి చెందుతాడు’ అని గ్యారీ పేర్కొన్నారు. సచిన్ స్థానాన్ని కోహ్లి భర్తీ చేయడంపై ఈ మాజీ కోచ్ ఆచితూచి స్పందించారు. ‘సచిన్ స్థానంలో మరొకరు రావడమనేది చాలా జాగ్రత్తగా జరగాల్సిన అంశం. అది చాలా క్లిష్టమైన స్థానం.
 
 ఎవరో ఒకరి పేరును ప్రతిపాదించడం రిస్క్‌తో కూడుకున్నది. మీడియా ఏవేవో కథనాలు ప్రసారం చేస్తోంది. కానీ నేను అలా చేయలేను. ఏదేమైనా కోహ్లి అద్భుతమైన బ్యాట్స్‌మన్. అతన్ని అవుట్ చేయాలంటే ప్రత్యర్థి బౌలర్లు చాలా కష్టపడాలి’ అని కిర్‌స్టెన్ వివరించారు.  శిఖర్ ధావన్‌లో ఆత్మస్థైర్యం ఎక్కువని ప్రశంసించారు.
 

మరిన్ని వార్తలు