ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కాదంట..

4 Dec, 2018 18:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సారథులను, కోచ్‌లను, ఆటగాళ్లను మార్చినా విజయాలు దక్కటం లేదని ఏకంగా జట్టు పేరును, లోగోను మార్చేసింది ఐపీఎల్‌లోని ఢిల్లీ ఫ్రాంఛైజీ. ఐపీఎల్‌ సీజన్‌ 12 కోసం సమయాత్తమవుతున్న అన్ని ఫ్రాంఛైజీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దానిలో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ పేరు, లోగో మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌గా కొత్త నామకరణం చేస్తూ లోగోనూ అవిష్కరించింది. 

2019 సీజన్‌లోనైనా ట్రోఫీ నెగ్గాలని ఢిల్లీ జట్టు భావిస్తోంది. ఇక ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఫ్రాంచైజీలో వాటాలు కొనుగోలు చేసిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ జట్టులో సమూల మార్పులు చేస్తోంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రధాన కోచ్‌గా.. మహ్మద్ కైఫ్ సహాయకుడిగా నియమించింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 

గంభీర్‌ వచ్చినా..
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో ఢిల్లీకి గౌతమ్‌ గంభీర్‌ నాయకత్వం వహించాడు. అయితే జట్టు పరాజయాలకు బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఢిల్లీ యువజట్టు ఊహించని రీతిలో రాణించినా విజయాలు మాత్రం సాధించలేకపోయింది. ఇక ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన వేలం ఈ నెల 18వ తేదీన జైపూర్‌లో జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇందులో 70 మంది క్రికెటర్లను వేలం పాడనున్నారు. వీరిలో 50 మంది భారత క్రికెటర్లు, 20 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నట్లు సమాచారం.ఇక ఇప్పటికే గౌతమ్‌ గంభీర్‌తో సహా పదిమంది ఆటగాళ్లను ఢిల్లీ రిలీజ్‌ చేసింది.
 

మరిన్ని వార్తలు