ఢిల్లీ ధమాకా

3 May, 2018 02:00 IST|Sakshi
మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రిషభ్‌ పంత్‌

చెలరేగిన రిషభ్, పృథ్వీ, అయ్యర్‌

పోరాడి ఓడిన రాజస్తాన్‌

బట్లర్‌ మెరుపులు వృథా

తొలుత వాన అడ్డుకుంది... తర్వాత ఢిల్లీ విరుచుకుపడింది. మరోసారి వర్షం అవాంతరం కలిగించింది... ఈసారి రాజస్తాన్‌ జూలు విదిల్చింది. చివరకు పరుగుల పోరులో డేర్‌ డెవిల్స్‌దే పైచేయి అయింది. చివరి     ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఢిల్లీ స్వల్ప తేడాతో నెగ్గి ఉపశమనం పొందింది.  

ఢిల్లీ: బలహీనమైన ఢిల్లీ, రాజస్తాన్‌ మధ్య మ్యాచేగా? అంటూ నిర్వేదంలో ఉన్న అభిమానులకు వారి అభిప్రాయం తప్పని చెప్పేలా ఈ రెండు జట్లు చక్కని టి20 క్రికెట్‌ విందు అందించాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఢిల్లీ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్‌ వేశాక వర్షం కారణంగా ఆట దాదాపు గంటన్నర ఆలస్యం కావడంతో 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... ఓపెనర్‌ పృథ్వీ షా (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (29 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల విధ్వంసక ఆటతో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ 17.1 ఓవర్‌ వద్ద ఉండగా మళ్లీ వాన పడటంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో రాజస్తాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151గా నిర్దేశించారు. ఓపెనర్లు జాస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), షార్ట్‌ (25 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు)ల మెరుపులతో రాజస్తాన్‌ ఓ దశలో గెలిచేలా కనిపించింది. అయితే వీరు వెనుదిరిగాక హిట్టింగ్‌ చేసేవారు లేక వెనుకబడిపోయింది. బౌల్ట్‌ వేసిన చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... కృష్ణప్ప గౌతమ్‌ (6 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఈసారి దానిని సాధించడంలో విఫలమయ్యాడు. 

విధ్వంసానికి చిరునామాలా... 
ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే ఓపెనర్‌ మున్రో (0) వికెట్‌ కోల్పోయినప్పటికీ... షా, అయ్యర్, పంత్‌ ధాటైన ఆటతో ఢిల్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. తొలి రెండు ఓవర్లలో అయిదే పరుగులిచ్చిన రాజస్తాన్‌ బౌలర్లకు తర్వాత నుంచి వీరు చుక్కలు చూపించారు. కులకర్ణి వేసిన 3వ ఓవర్లో పృథ్వీ రెండు సిక్స్‌లు, ఫోర్‌ కొట్టడంతో మొదలైన విధ్వంసం ఆరో ఓవర్‌ వరకు సాగింది. ఈ క్రమంలో వరుసగా 16, 11, 15, 14 పరుగులు వచ్చాయి. భారీ స్కోరు చేసే ఊపులో కనిపించిన షా... శ్రేయాస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఓ ఎండ్‌లో అయ్యర్‌ తనదైన శైలిలో పరుగులు సాధిస్తుండగా, పంత్‌ మరింత దూకుడు చూపడంతో పదో ఓవర్‌ నుంచి వరద మొదలైంది. 13వ ఓవర్లో కులకర్ణి మూడు వైడ్లు సహా 20 పరుగులు ఇచ్చుకోవడంతో ఢిల్లీ స్కోరు అమాంతం పెరిగిపోయింది. అర్ధ శతకాలు పూర్తయ్యాక వీరిద్దరినీ ఉనాద్కట్‌ ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపి జట్టుకు ఊరటనిచ్చాడు. 

బట్లర్‌ విరుచుకుపడినా... 
మామూలుగానే రాజస్తాన్‌ది నెమ్మదైన బ్యాటింగ్‌. అలాంటిది ఓవర్‌కు దాదాపు 13 పరుగుల రన్‌ రేట్‌తో పరుగులు చేయాలంటే ఇక ఆశలు వదులుకోవాల్సిందే. అయితే మరో ఓపెనర్‌ షార్ట్‌ ఇబ్బంది పడుతున్నా... బట్లర్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝళిపించాడు. అవేశ్‌ ఖాన్‌ వేసిన మూడో ఓవర్లో మూడు సిక్స్‌లు సహా 23 పరుగులు చేశాడు. 18 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. అతడున్నంత సేపు మ్యాచ్‌ రాజస్తాన్‌ వైపే కనిపిచింది. కానీ 33 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉండగా మిశ్రా బౌలింగ్‌లో బట్లర్‌ స్టంపౌట్‌ కావడంతో పరిస్థితి క్లిష్టమైంది. బౌల్ట్‌ ఒకే ఓవర్లో శామ్సన్‌ (3), స్టోక్స్‌ (1)లను అవుట్‌ చేసి మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్స్‌లు బాదిన షార్ట్‌ ఫలితాన్ని మార్చేలా కనిపించినా తర్వాతి బంతికే అవుటయ్యాడు. కృష్ణప్ప గౌతమ్, రాహుల్‌ త్రిపాఠి (9) పోరాడినా రాయల్స్‌ విజయానికి నాలుగు అడుగుల దూరంలోనే నిలిచిపోయింది. 

>
మరిన్ని వార్తలు