ఆంధ్ర అదరహో

23 Feb, 2019 00:40 IST|Sakshi

టి20 చరిత్రలోనే అతి పెద్ద విజయం

రికీ భుయ్‌ మెరుపు సెంచరీ

42 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 108 నాటౌట్‌

ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ

సాక్షి, విజయవాడ: ముందు బ్యాట్స్‌మెన్‌ వీరవిహారం... ఆ తర్వాత బౌలర్ల విజృంభణ... వెరసి టి20 చరిత్రలోనే ఆంధ్ర క్రికెట్‌ జట్టు అతి పెద్ద విజయం నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. దేశవాళీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం స్థానిక మూలపాడు మైదానంలో నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 179 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. పరుగుల పరంగా టి20 చరిత్రలో ఇది పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక జట్టు పేరిట ఉండేది. 2007లో తొలి టి20 ప్రపంచకప్‌లో భాగంగా కెన్యాతో జొహన్నెస్‌బర్గ్‌లో సెప్టెంబరు 14న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 172 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఆ రికార్డును ఆంధ్ర జట్టు శుక్రవారం బద్దలు కొట్టింది.  

38 బంతుల్లోనే రికీ సెంచరీ... 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రికీ భుయ్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 108 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 38 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టి20ల్లో భారత్‌ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో శ్రేయస్‌ అయ్యర్‌ (38 బంతుల్లో), రిషభ్‌ పంత్‌ (32 బంతుల్లో), రోహిత్‌ శర్మ (35 బంతుల్లో), యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో) ముందున్నారు.  రికీ భుయ్‌తోపాటు గిరినాథ్‌ రెడ్డి (31 బంతుల్లో 62; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా హడలెత్తించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 10 ఓవర్లలో 150 పరుగులు జోడించడం విశేషం. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ హనుమ విహారి (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్‌) దూకుడుగా ఆడాడు. నాగాలాండ్‌ జట్టు కెప్టెన్‌ రంగ్సెన్‌ జొనాథన్‌ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను బరిలోకి దించినా ఆంధ్ర జోరును నిలువరించలేకపోయాడు.  

సూపర్‌ శశికాంత్‌... 
245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నాగాలాండ్‌ 13.1 ఓవర్లలో 65 పరుగులకు కుప్పకూలి ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్‌ (3/8), షేక్‌ ఇస్మాయిల్‌ (3/25), కరణ్‌ శర్మ (3/14) మూడేసి వికెట్లు తీశారు. ముఖ్యంగా పేస్‌ బౌలర్‌ శశికాంత్‌ హడలెత్తించాడు. తాను వేసిన రెండో ఓవర్లో శశికాంత్‌ ఐదు బంతుల తేడాలో మూడు వికెట్లు తీయడం విశేషం. నాగాలాండ్‌ జట్టులో జొనాథన్‌ (25 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్‌), పారస్‌ షెరావత్‌ (11 బంతుల్లో 13; 3 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోరు దాటలేకపోయారు.    

మరిన్ని వార్తలు