విజేత ఢిల్లీ పబ్లిక్ స్కూల్

21 Jul, 2014 00:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మల్క కొమరయ్య (ఎం.కె.) అంతర పాఠశాలల క్రికెట్ టోర్నమెంట్‌లో అండర్-15, 17 విభాగాల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) విజేతగా నిలిచింది. అండర్-17 విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో డీపీఎస్ (నాచారం) జట్టు 17 పరుగుల తేడాతో సెయింట్ పీటర్స్ (బోయిన్‌పల్లి) జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీపీఎస్... నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. యశస్వి (47 బంతుల్లో 69; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), భావిన్ (4 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి డీపీఎస్‌కు భారీ స్కోరునందించారు. అనంతరం సెయింట్ పీటర్స్ 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు మాత్రమే చేయగలిగింది.
 
 ఆ జట్టులో శ్రీజిత్ (22 బంతుల్లో 33) ఒక్కడే రాణించాడు.
 అండర్-15 ఫైనల్లోనూ డీపీఎస్ (నాచారం) జట్టు సెయింట్ పీటర్స్ (బోయిన్‌పల్లి) జట్టుపైనే ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీపీఎస్... భావిన్ (24 బంతుల్లో 34) రాణించడంతో 12 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సెయింట్ పీటర్స్ 7 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికాస్ (26 బంతుల్లో 26) ఒక్కడే పోరాడాడు. డీపీఎస్ బౌలర్లు అమృత్ (2/17), అన్విత్ (2/21) రెండేసి వికెట్లు పడగొట్టారు.
 
 భవాన్స్ గెలుపు
 ఇదే టోర్నీ అండర్-13 విభాగంలో భవాన్స్ (సైనిక్‌పురి) జట్టు విజేతగా నిలిచింది. డీపీఎస్ (నాచారం)తో జరిగిన ఫైనల్లో భవాన్స్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డీపీఎస్... అమృత్ (36 బంతుల్లో 51), రిషి (18 బంతుల్లో 23) రాణించడంతో 12 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అనంతరం భవాన్స్.. వికెట్లేమీ కోల్పోకుండానే 101 పరుగులు చేసి గెలిచింది. అశ్మిత్ (31 బంతుల్లో 51) అర్ధసెంచరీతో భవాన్స్‌కు విజయాన్నందించాడు.

మరిన్ని వార్తలు