ఢిల్లీలో గల్లీకో పార్టీ.. ప్రధాన పార్టీలు బెంబేలు !

7 Apr, 2019 08:42 IST|Sakshi

పోటీలో పదిహేను వరకు పార్టీలు..

లక్ష్యాలు ఘనం.. సిద్ధాంతాలు శూన్యం

సాక్షి, ఢిల్లీ : ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)తో పాటు చిత్ర విచిత్రమైన పేర్లతో అనేక చిన్న పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పన్నెండు పదిహేను వరకూ ఉన్న ఈ పార్టీల లక్ష్యాలు కూడా అనూహ్యమైన రీతిలో కనిపిస్తాయి. నగరంలోని ఏడు లోక్‌సభ సీట్లలో ఇవి పోటీ చేస్తున్నాయి. 2015లో ప్రారంభించిన పూర్వాంచల్‌ జనతా పార్టీ ప్రధాని పదవికి తన అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఆప్కీ అప్నీ పార్టీ (ఆప్‌–పీపుల్స్‌) ఆదివారం తన అభ్యర్థుల పేర్లు ప్రకటించబోతోంది.

పీస్‌ పార్టీ ఇదివరకే ఈశాన్య ఢిల్లీ సీటుకు తన అభ్యర్థిని ప్రకటించింది. చాందినీచౌక్, తూర్పు ఢిల్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తోంది. పెద్ద పెద్ద లక్ష్యాలున్న ఈ బుల్లి బుల్లి పార్టీల ఆఫీసులు మాత్రం కిక్కిరిసిన గల్లీల్లో చిన్న గదుల్లోనే ఉన్నాయి. ఈ పార్టీలు జాతీయ పక్షాలతో పోటీ పడుతూ తాము సాధించే లక్ష్యాల గురించి గొప్పగా మాట్లాడుతున్నాయి. కాని, ఇలాంటి పార్టీలకు చెందిన అనేక మంది నేతలు తమ రాజకీయ సిద్ధాంతాల గురించి వివరించలేక నానా తంటాలు పడుతున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీచేసే హక్కు తమకు ఉందంటూ ఉపన్యాసాలు దంచుతున్నారు. ఈ చిన్న పార్టీలను తమ ప్రత్యర్థుల ఓట్లు చీల్చడానికి, పెద్ద పార్టీల అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో అయోమయం సృష్టించడానికి ప్రధాన రాజకీయ పక్షాలే ఏర్పాటు చేశాయనే ఆరోపణలు లేకపోలేదు. కాని, ఈ ఆరోపణల్లో నిజం లేదంటూ చిన్న పార్టీలు కొట్టేస్తున్నాయి. 

ఎన్నికల తేదీ రాకతో నిద్ర లేచిన చిన్న పార్టీలు
లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించగానే చిన్నచిన్న పార్టీలు నిద్ర నుంచి మేల్కొని రంగంలోకి దిగాయి. వీటిలో చాలా వరకూ కిందటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాయి. కాని, తమకు విజయావకాశాలున్నాయంటూ మొండిగా వాదిస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పీస్‌ పార్టీ మూడు స్థానాల నుంచి పోటీ చేసింది. ఇంకా 2013, 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను నిలిపింది.

2013 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఇద్దరు తమ డిపాజిట్లు దక్కించుకున్నారని ముస్లిం ల మద్దతు ఉన్న ఈ పార్టీ నేత మహ్మద్‌ అక్రమ్‌ గొప్పగా చెప్పుకున్నారు. అగర్‌ జాన్‌ పార్టీ స్థాపకుడు ఏకే అగర్వాల్‌ 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో మోదీపై పోటీచేశారు. ‘మా పార్టీ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 2017 ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసింది. అవినీతి, నిరుద్యోగ నిర్మూలన మా లక్ష్యం. నిరుద్యోగులకు ప్రత్యేక భృతి చెల్లించాలి’ అని అగర్వాల్‌ చెప్పారు.

పార్టీ నేత స్వదేశ్‌ ఓహ్ఢీ పేరుతో స్థాపించిన స్వదేశ్‌ అతుల్య భారత్‌ పార్టీ 2014లో చాందినీ చౌక్, న్యూఢిల్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ‘2016 చివర్లో మోదీ సర్కారు అమలు చేయక ముందే మా పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో పెద్ద నోట్లు రద్దు చేస్తామని మేం హామీ ఇచ్చాం’ అని కిందటిసారి న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన పార్టీ నేత స్వదేశ్‌ ఓహ్ఢీ చెప్పారు. జాతీయ పార్టీ లతో పోటీపడే శక్తి చిన్న పార్టీలకు లేనప్పుడు ఎం దుకు పోటీ చేశారని ప్రశ్నిం చగా, ‘నిజమే, నేను గెలవను. ప్రజలకు నా సందేశం ఇవ్వడానికి ఎన్నికల ప్రచారం ఒక అవకాశమిస్తుంది’ అని ఆయన జవాబిచ్చారు. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, ఇలాంటి చిన్న పార్టీలకు కలిపి ఆరు శాతం ఓట్ల దక్కాయి. 

‘ఆప్‌’కు ఆప్కీ అప్నీ పార్టీ దెబ్బ
బురారీ ప్రాంతంలోని అమృత్‌ విహార్‌కు చెందిన ఆప్కీ అప్నీ పార్టీ నేత రాంబీర్‌ చౌహాన్‌ మాట్లాడుతూ దేశాన్ని కుల రాజకీయాల నుంచి విముక్తి చేస్తానని, పేదలను కాపాడతానని చెబుతున్నారు. ఈ పార్టీ ఎన్నికల గుర్తు కిరణాలున్న టార్చి లైటు.. ఆప్‌ ఎన్నికల చిహ్నం చీపురు మాదిరిగా ఉండడంతో ఆ గుర్తును వాడకుండా నిరోధించాలంటూ ఆప్‌ ఇటీవల కోర్టుకు కూడా వెళ్లింది. దీంతో ఈ చిన్న పార్టీకి (ఆప్‌–పీపుల్స్‌) కిరణాలు లేని టార్చిలైటును ఎన్నికల కమిషన్‌ కేటాయించింది.

ఢిల్లీలోని ఐదు సీట్లకు ఈ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నూరు శాతం ఉపాధి కల్పిస్తామంటూ ఆప్‌–పీపుల్స్‌ తన విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ‘జనం ఎన్నికల హామీలు నమ్మకపోవడంతో మేం ఎలాంటి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయలేదు’ అని ఈ పార్టీ నేత చౌహాన్‌ తెలిపారు. యూపీ తూర్పు ప్రాంతం నుంచి వలసొచ్చిన ప్రజలను ఆకట్టుకునేందుకు స్థాపించిన పూర్వాంచల్‌ జనతా పార్టీ ఇప్పటికే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, ఉగ్రవాదంపై ప్రజలకు వివరించడానికి ఇంటింటి ప్రచారం పూర్తి చేసినట్టు తెలిపింది.

ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తామని చెబుతున్న ఈ పార్టీ ప్రధాని అభ్యర్థిగా సతీశ్‌ చంద్ర ఝా పేరు ప్రకటించారు. ఝా పశ్చిమ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాలు అందుబాటులోకి తెచ్చేందుకు కొందరు మేధావుల బృందం ఈ పార్టీ స్థాపించిందని పూర్వాంచల్‌ పార్టీ జాతీయ కన్వీనర్‌ ముకేష్‌ సింగ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు