యువరాజ్‌ పెళ్లిపై ఆ ప్రభావం లేదు

26 Nov, 2016 16:20 IST|Sakshi
యువరాజ్‌ పెళ్లిపై ఆ ప్రభావం లేదు

న్యూఢిల్లీ: ఈ నెల 8న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాక ప్రజలకు కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. వివాహ కార్యక్రమాలను ముందే నిశ్చయించుకున్నవారికి మరిన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వివాహంపై లేదట.

పాతనోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించకముందే యువరాజ్‌ పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 30న యువీ నటి హజెల్‌ కీచ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. యువీ తన స్థాయికి తగ్గట్టు డబ్బు ఖర్చు పెట్టకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటున్నాడు. యువీ తండ్రి యోగరాజ్‌ సింగ్ ఈ విషయం చెప్పాడు.

‘పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల నల్లధనం దాచుకున్న వారికే సమస్య. యువీ పెళ్లిని గ్రాండ్‌గా చేయాలని భావించినట్టయితే కరెన్సీతో సమస్యలు వచ్చేవి. మా కుటుంబం ఎప్పుడూ సింప్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తుంది. దేశంలో చాలామంది పేదలున్నారు. పెళ్లికి అనవసరంగా భారీగా ఖర్చు చేయడం కంటే ధార్మిక సంస్థలకు విరాళాలు ఇస్తే బాగుంటుంది. యువీ పెళ్లికి స్నేహితులు, క్రికెటర్లు సహా అత్యంత సన్నిహితులైన 60 మంది మాత్రమే వస్తారు. ఒకేరోజు సంగీత్‌, మెహందీ, రిసెప్షన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తాం’ అని యోగరాజ్‌ అన్నాడు.

మరిన్ని వార్తలు