అద్భుతం: అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు కోచ్‌గా!

16 Jul, 2018 09:54 IST|Sakshi
దిదియర్‌ డెచాంప్సే.. ఆటగాడిగా..కోచ్‌గా

మాస్కో: విశ్వ వేదికపై ఫ్రాన్స్‌ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగిరింది. ఆదివారం క్రొయేషియాతో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో గెలుపొందడంతో రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ మళ్లీ ‘ది బ్లూస్‌’ చెంత చేరింది. ఇలా ఫ్రాన్స్‌ విశ్వవిజేతగా నిలిచిన రెండు సందర్భాల్లో ఆ జట్టు కోచ్‌ దిదియర్‌ డెచాంప్స్ పాత్ర మరవలేనిది. 1998 సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ తొలిసారిగా టైటిల్‌ అందుకోగా.. ఆ జట్టుకు దిదియర్‌ డెచాంప్సే కెప్టెన్‌ కావడం విశేషం. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆ కెప్టెనే.. కోచ్‌గా మారి మరోసారి తమ జట్టును జగ్గజ్జేతగా నిలిపాడు.

దీంతో అటు కెప్టెన్‌గా.. ఇటు కోచ్‌గా వరల్డ్‌కప్‌ సాధించిన మూడో ఆటగాడిగా దిదియర్‌ డెచాంప్స్‌ గుర్తింపు పొందాడు. జగాలో (బ్రెజిల్‌), బ్రెకన్‌బాయర్‌ (జర్మనీ)లు డెచాంప్స్‌ కన్నా ముందు ఇలా కోచ్‌, కెప్టెన్‌గా తమ జట్లకు ప్రపంచకప్‌ అందించారు. జగాలో 1958,1962లో బ్రెజిల్‌ను ఇలా రెండు సార్లు విశ్వ విజేతగా నిలపగా.. బ్రెకన్‌ బాయర్‌ కెప్టెన్‌గా 1974, కోచ్‌గా 1990లో జర్మనీకి ప్రపంచకప్‌ అందించారు. 

ప్రస్తుత టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా అజేయంగా ప్రపంచకప్‌ అందుకోవడంలో కోచ్‌ దిదియర్‌ డెచాంప్స్‌ పాత్ర కీలకం. ముఖ్యంగా పిన్న వయసు ఆటగాళ్లకు అవకాశమివ్వడం.. వెన్ను తట్టి ప్రోత్సహించడం.. కోచ్‌గా దిదియర్‌ డెచాంప్స్‌ ప్రత్యేకత. ఎంబాపె వంటి మెరికల్లాంటి కుర్రాడి ప్రతిభను వెలికితీసి డెచాంప్స్‌ ప్రపంచానికి పరిచయం చేశాడు. బలహీనతలను పక్కన బెట్టి ఆటగాళ్లను మానసికంగా తీర్చిదిద్దడంతో డెచాంప్స్‌ విజయవంతమయ్యాడు. నిజానికి ఫైనల్‌ పోరులో ఫ్రాన్స్‌ అత్యద్భుత ఆట తీరు కనబర్చకపోయినా, తమ బలాన్ని నమ్ముకొని తెలివిగా, వ్యూహాత్మకంగా ఆడింది. దీనికి కూసింత అదృష్టం కూడా కలిసిరావడంతో సంచలనాల క్రొయేషియా ఆట కట్టించింది. ఈ వ్యూహాలు వెనకుండి నడిపించిన వాడు డెచాంప్స్‌. గొప్పగా ఆడలేదనే విషయాన్ని మ్యాచ్‌ అనంతరం అతనే అంగీకరించాడు. 

విజయానంతరం మాట్లాడుతూ.. ‘మా యువ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే టాప్‌ జట్టుగా నిలిచింది. మా చాంపియన్లలో కొందరికైతే 19 ఏళ్లే! నిజానికి మేం అంత గొప్పగా ఆడలేదు. కానీ మానసిక నైపుణ్యాన్ని కనబరిచాం. మొత్తానికి నాలుగు గోల్స్‌ చేశాం. గెలిచేందుకు మా వాళ్లకే అర్హత ఉంది. మా బృందమంతా చాలా కష్టపడింది. ఈ గెలుపుదారిలో ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంది. రెండేళ్ల క్రితం ‘యూరో’ గెలవలేకపోవడం బాధించింది. కానీ గుణపాఠాలెన్నో నేర్పింది. ఇది నా విజయం కాదు. ఆటగాళ్లు 55 రోజులుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ ప్రపంచకప్‌. దీన్నిప్పుడు ఫ్రాన్స్‌కు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది.’  తెలిపాడు.

మరిన్ని వార్తలు