బీరు ఏరులై పారుతోంది!

9 Jul, 2014 01:17 IST|Sakshi

రియో డి జనీరో: ఈసారి ప్రపంచకప్‌లో బీరు ఏరులై పారుతోంది. గతంలో బ్రెజిల్‌లోని స్టేడియాలలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నా... ఈసారి మెగా టోర్నీ కోసం వీటిని సడలించారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రతి మ్యాచ్‌కూ రెండు గంటల ముందే బీరు కౌంటర్ల దగ్గర బారులు తీరుతున్నారు. పలు దేశాల జెండాల రంగులతో ప్రపంచకప్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కప్ బీర్లకు ఈసారి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది.

473 మిల్లీలీటర్ల కప్‌ను రూ.270 నుంచి రూ. 360 వరకు చెల్లించి కొంటున్నారు. అయితే బీర్ తాగిన తర్వాత ఆ కప్‌లను పడేయకుండా... ప్రపంచకప్ జ్ఞాపికగా తీసుకువెళుతున్నారు. అయితే ఈ బీరు అమ్మకాలు పెరిగినట్లే... స్టేడియాల్లో ప్రత్యర్థి దేశాల అభిమానుల మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఏ గొడవా పెద్దది కాకుండా సెక్యూరిటీ సిబ్బంది నిలువరించారు.
 

మరిన్ని వార్తలు