శభాష్ డిసిల్వా.. లంక క్రికెటర్‌కు కోహ్లీ, రోహిత్ కంగ్రాట్స్

6 Dec, 2017 14:00 IST|Sakshi

రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన ధనంజయ డిసిల్వా

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ చివరి రోజు ఆటలో శ్రీలంక బ్యాట్స్‌మన్‌ ధనంజయ డిసిల్వా శతకం సాధించాడు. షమీ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి 188 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో సెంచరీ మార్కు చేరుకున్నాడు. ధనంజయ కెరీర్‌లో ఇది మూడో టెస్ట్ శతకం. 119 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కాగా, కష్ట సమయంలో జట్టును ఆదుకున్న డిసిల్వాను లంకేయులతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అభినందించారు. టెస్ట్ చివరిరోజు తొలి సెషన్, లేక రెండో సెషన్లోనే టీమిండియా బౌలర్లు లంకను చాప చుట్టేస్తారనుకుంటే లంక కెప్టెన్ చండిమాల్ (36) సాయంతో డిసిల్వా స్కోరు బోర్డుకు పరుగులు జోడించాడు.

చండిమాల్ ఔటయ్యాక రోషన్ డిసిల్వా వికెట్ పడకుండా సహకరించడంతో ధనంజయ అజేయ శతకంతో మెరిశాడు. సెంచరీ అనంతరం 110 పరుగుల వద్ద ధనంజయకు లైఫ్ లభించడంతో లంకేయులు ఊపిరి పీల్చుకున్నారు. 69వ ఓవర్ రెండో బంతిని ధనంజయ ఆడగా.. గాల్లోకి లేచిన బంతి అశ్విన్ చేతుల్లో పడినట్లే అనిపించినా క్యాచ్ చేజారింది. ధనంజయ డిసిల్వా (210 బంతుల్లో 119 రిటైర్డ్ హర్ట్‌: 15 ఫోర్లు, 1 సిక్స్).  ప్రస్తుతం రోషన్ డిసిల్వా (25), డిక్‌వెల్లా(0) క్రీజులో ఉన్నారు. 74 ఓవర్లలో రెండో ఇన్నింగ్స్‌లో లంక స్కోరు 206/5.

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 536/7  డిక్లేర్‌, రెండో ఇన్నింగ్స్‌ 246/5 డిక్లేర్‌
  • శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 373 ఆలౌట్‌
మరిన్ని వార్తలు