ధోని, రోహిత్‌లతో కలిసే వ్యూహం 

16 May, 2019 02:29 IST|Sakshi

నాలుగో స్థానంపై స్పష్టత ఉంది 

పంత్‌ కంటే కార్తీకే బెటర్‌ 

భారత కెప్టెన్‌ కోహ్లి వ్యాఖ్య 

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌ వేటలో భారత్‌ వేసే అడుగుల్లో మాజీ కెప్టెన్‌ ధోని, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ల భాగస్వామ్యం ఉంటుందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పాడు. ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జట్టు సన్నద్దం, ఆటగాళ్ల ప్రదర్శనపై అతను వివరించాడు. వెటరన్‌ మాజీ కెప్టెన్‌ ధోని అనుభవం జట్టుకు ఉపకరిస్తుందన్నాడు. ‘ధోని అనుభవజ్ఞుడే కాదు. ఆటపై పట్టున్న చురుకైన క్రికెటర్‌. వికెట్ల వెనుక అతని చతురత అద్భుతం. అమూల్యమైన ఆటగాడు ధోని. అతను జట్టులో ఉండటమంటే అనుభవం, సంపద ఉన్నట్లే! అతని గురించి ఇంకా చెప్పేదేముంటుంది. నా కెరీరే అతని మార్గదర్శనంలో మొదలైంది. నాలాగే మరికొందరికీ అతనే మార్గదర్శకుడు. జట్టును నడిపించడంలో, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అతనే దిక్సూచి.  జట్టు గెలుపుకోసమే ధోని తపిస్తాడు’ అని అన్నాడు.  

రోహిత్‌ కూడా కీలకమే 
నాలుగు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్, టీమిండియా వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా జట్టు వ్యూహకర్తల్లో ఒకడని కోహ్లి చెప్పాడు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలున్న వీరిద్దరి సూచనల్ని జట్టు పాటిస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది తమకు కీలకమైన సంవత్సరమని కఠిన సవాళ్లనెదుర్కొనేందుకు జట్టు సిద్ధంగా ఉందని తెలిపాడు. ప్రపంచకప్‌ కోసం జట్టు సన్నదమైందని అన్నాడు. నాలుగో స్థానంపై జట్టు యాజమాన్యానికి స్పష్టత ఉందని... పరిస్థితులు, ప్రత్యర్థుల ఆధారంగా జట్టు కూర్పు ఉంటుందని కోహ్లి చెప్పాడు. ఎన్నో ప్రణాళికలుంటాయి... వ్యూహాలుంటాయి. వాటికి తగినట్లే జట్టు ప్రదర్శన ఉంటుంది.  

ధోని అందుబాటులో లేకపోతే... 
భారత వికెట్‌ కీపర్‌గా ధోని అనివార్య పరిస్థితుల వల్ల ఆడలేకపోతే కుర్రాడైన రిషభ్‌ పంత్‌ కంటే అనుభవజ్ఞుడైన దినేశ్‌ కార్తీకే మెరుగని చర్చించుకున్నట్లు కోహ్లి చెప్పాడు. వికెట్ల వెనుక కార్తీక్‌ సరైన ప్రత్యామ్నాయంగా భావించే వెటరన్‌ ఆటగాడిని ఎంపిక చేశామని తెలిపాడు.  

మరిన్ని వార్తలు