సిక్సర్ల కంటే సింగిల్స్‌పైనే ఫోకస్ చేశాడు

27 May, 2020 13:28 IST|Sakshi

ధోని ఆటలో కసి కనిపించలేదు

రోహిత్‌, కోహ్లిలు కూడా అంతగొప్పగా ఆడలేదు

వన్డే ప్రపంచకప్‌-2019 నాటి ముచ్చట్లను గుర్తుచేసుకున్న స్టోక్స్‌

హైదరాబాద్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2019లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని బ్యాటింగ్‌ తీరును ఇంగ్లీష్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌​ స్టోక్స్‌ తప్పుపట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో ధోని బ్యాటింగ్‌ వింతగా అనిపించిందన్నాడు. స్టోక్స్‌ త్వరలో ఆవిష్కరించనున్న 'ఆన్‌ఫైర్‌' అనే పుస్తకంలో ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో ధోని, జాదవ్‌ ఆటలో అసలు ఏ మాత్రం కసి కనిపించలేదన్నాడు. గెలిచే అవకాశం ఉంటే దూకుడుగా ఆడటమై సరైనదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  

'లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి 11 ఓవర్లలో 112 పరుగులు అవసరమైనప్పుడు ధోనీ క్రిజులోకి వచ్చాడు. అప్పుడు అతడి ఆటలో కసి కనిపించలేదు. సిక్సర్లు బాదడం కన్నా.. సింగిల్స్‌పైనే ఎక్కువ దృష్టి సారించడం నన్ను ఆశ్చర్యపరిచింది. రెండు ఓవర్లు మిగిలున్నప్పుడు మేం నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదించాలి. కానీ ధోని, జాదవ్‌ల బ్యాటింగ్‌ మ్యాచ్‌ను మా వైపు టర్న్‌ చేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌, కోహ్లిల బ్యాటింగ్‌కు కూడా విచిత్రంగా అనిపించింది. 27 ఓవర్ల వరకు క్రీజులో ఉండి 138 పరుగుల భాగస్వామ్యమే నమోదు చేశారు. అయితే మేం బాగా బౌలింగ్‌ చేశామని తెలుసు. కానీ టీమిండియా బ్యాటింగ్‌ విచిత్రంగా అనిపించింది. ఇలాంటి సమయంలో అటాకింగ్‌ చేసి మాపై ఒత్తిడి పెంచాలి. కానీ ఆ విషయంలో రోహిత్‌-కోహ్లిలు విఫలమయ్యారు. దీంతో విజయవకాశాలు మాకు ఎక్కువయ్యాయి’ అని స్టోక్స్‌ అనాటి మ్యాచ్‌కు సంబంధించిన విషయాలను గుర్తుచేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. 

చదవండి:
టీ20 ప్రపంచకప్‌ వాయిదా? రేపు క్లారిటీ!
'ఇద్దరూ గొప్పే.. కానీ స్మిత్‌కే నా ఓటు'

మరిన్ని వార్తలు