నిషేధం ముగిసింది.. బాస్ ఈజ్ బ్యాక్!

15 Jul, 2017 13:45 IST|Sakshi
నిషేధం ముగిసింది.. బాస్ ఈజ్ బ్యాక్!

రాంచీ: నిషేధం ముగియడంతో ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంట వ్యవధిలోనే లక్షల లైక్స్‌, వేల కామెంట్లతో ధోని పోస్ట్ దూసుకుపోతోంది. తమపై నిషేధం ముగిసిందంటూ శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఈ శుభవార్తను షేర్ చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుతో విడదీయరాని అనుబంధం ఉంది.

సీఎస్‌కే జట్టు ఆటగాడిగా 7వ నెంబర్ జెర్సీ ధరించిన ధోని తన ఇంటి ఆవరణలో దిగిన ఓ ఫొటోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేయగా విపరీతమైన స్పందన వస్తోంది. చెన్నైపై నిషేధం ముగిసింది.. బాస్ ఈజ్ బ్యాక్! అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తమిళంలో నాయకుడు అనే అర్థం వచ్చేలా ధోని జెర్సీపై 'తలా' అని రాసి ఉంది. 2016, 2017 సీజన్లలో చెన్నై జట్టుపై నిషేధం ఉండటంతో ధోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తరఫున బరిలోకి దిగాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పుణే ఫైనల్లో ముంబై చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ధోనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెన్నై ఫ్రాంచైజీ ఇదివరకే ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు