నాలుగు నచ్చింది

24 Oct, 2016 23:35 IST|Sakshi
నాలుగు నచ్చింది

ఆర్డర్ మార్చి ఫలితం సాధించిన ధోని
ఒత్తిడికి దూరంగా స్వేచ్ఛగా బ్యాటింగ్ 


భారత్‌కు అద్భుత విజయాలు అందించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని సాధించిన కీర్తి అపారం. దీంతో పాటు వన్డేల్లో తన బ్యాటింగ్‌తోనూ సత్తా చాటిన అతను సుదీర్ఘకాలంగా ‘ఫినిషర్’ అనే పదానికి అసలైన అర్థంగా మారిపోయాడు. ముందుగా బ్యాటింగ్ అరుుతే చివరి ఓవర్లలో మెరుపు షాట్లతో స్కోరు బోర్డును పరుగెత్తించడం, లక్ష్యాన్ని ఛేదించే సమయంలోనైతే కావాల్సిన వేగంతో పాటు సరిగ్గా లెక్క వేసుకొని అతను గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో. ఇక సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన క్షణాలు అభిమానులందరి మనసుల్లో ముద్రించుకుపోయారుు. అరుుతే అలాంటి ఫినిషర్ ఇప్పుడు ‘ఫినిష్’ కావాలని అతనే భావిస్తున్నాడు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడాలని కోరుకుంటున్నాడు. 

 

సాక్షి క్రీడా విభాగం
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే సమయానికి భారత్ విజయం కోసం 31.2 ఓవర్లలో 171 పరుగులు చేయాల్సి ఉంది. రన్‌రేట్ కూడా ఆరు లోపే ఉంది. ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అప్పటికే వెనుదిరిగిన దశలో ధోని మ్యాచ్‌ను గెలిపిస్తాడని అభిమానులు ఆశించడంలో తప్పు లేదు. కానీ ఇబ్బందిగా ఆడిన ధోని చివరకు 65 బంతుల్లో 39 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఇది సహజంగానే అందరినీ నిరాశలో ముంచెత్తింది. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ధోని ఫినిషర్ అనేది ముగిసిపోరుున గతంగా చాలా మంది వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒకసారి ఇలాంటి చర్చే వచ్చినప్పుడు ‘నేనొక్కడినే ఫినిష్ చేయాలా, మిగతావారు జట్టు సభ్యులు కారా’ అంటూ ఒకింత ఆగ్రహంతోనే ధోని జవాబిచ్చాడు. కానీ ఈసారి అతను మరో సారి చర్చకు అవకాశం ఇవ్వలేదు. ఆ స్థానంలో తన సహజమైన ఆటతీరును కోల్పోతున్నానని, అందుకే నాలుగో స్థానానికి మారుతున్నానని కచ్చితంగా చెప్పేశాడు.

 
గెలుపులో భాగమై...
మొహాలీ వన్డేలో 9వ ఓవర్లోనే ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. 41 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోరుున దశలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి బాధ్యతాయుతంగా ఆడాడు. తగినన్ని ఓవర్లు ఉండటంతో అతను వచ్చీ రాగానే షాట్లకు పోకుండా కుదురుగా ఆడే అవకాశం దక్కింది. మొదటి 30 బంతుల్లో 20 పరుగులే చేసినా ఆ తర్వాత మెల్లగా దూకుడు పెంచి మంచి స్ట్రైక్‌రేట్‌ను అందుకున్నాడు. ఇప్పుడు ఇదే తరహా ఆటను అతను ఇష్టపడుతున్నాడు. క్రీజ్‌లో ఎక్కువ సేపు గడపాలని భావిస్తున్నట్లు అతనే స్వయంగా చెప్పుకున్నాడు ‘అప్పటికే 2 వికెట్లు మాత్రమే కోల్పోరుు ఉంటాము పెద్దగా ఒత్తిడి ఉండదు. ఇది జట్టు కోసం కాకుండా నా కోసం తీసుకున్న నిర్ణయం. చాలా కాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాను.  ఈ మ్యాచ్‌లో పరుగులు సాధించడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఇన్నింగ్‌‌స మరిన్ని ఆడాలని కోరుకుంటున్నా’ అని ధోని వ్యాఖ్యానించాడు. ఒక దశలో సెంచరీ చేస్తాడనిపించి విఫలమైనా... ఈ ఇన్నింగ్‌‌స చూసినవారు అతని ఆటను ప్రశంసించకుండా ఉండలేరు. వాస్తవంగా కూడా మూడో వన్డేలో ధోని ముందుగా రాకుండా పాండే గానీ జాదవ్ గానీ వచ్చి ఉంటే పరిస్థితి ఇంత మెరుగ్గా ఉండకపోయేదేమో. ఆ సమయంలో మరో వికెట్ పడితే మళ్లీ ధోనిపైనే ముగించాల్సిన ఒత్తిడి, ఫలితం మారే ప్రమాదం కూడా ఉండేది. కానీ ఇలాంటిది లేకుండా అతను స్వేచ్ఛగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగలిగాడు. ఐదునుంచి ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు వచ్చీ రాగానే మిగిలిన 10-12 ఓవర్లలో భారీ షాట్లు కొట్టాలని ప్రయత్నించడం, అటు వైపు చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్ లేక మొత్తం భారం తనపైనే పడటం వల్ల  తన స్ట్రరుుక్ రొటేట్ చేసే సామర్థ్యం కోల్పోరుునట్లు ధోని అంగీకరించాడు. అరుుతే జట్టు అవసరాల దృష్ట్యా మరో అనుభవజ్ఞుడైన ఆటగాడు లేక ఫినిషింగ్ బాధ్యతను అతను తీసుకున్నాడు.

 
ఇక ముందూ కొనసాగాలి

వన్డేల్లో మధ్య ఓవర్లలో జాగ్రత్తగా ఆడుతూనే మధ్య మధ్యలో భారీ షాట్లు కొట్టగల నైపుణ్యం కీలకం. విరాట్ కోహ్లి ఇందులో మాస్టర్ కాగా మరో వైపునుంచి కూడా అదే స్థారుు ఆటగాడు ఉంటే భారత్‌కు తిరుగుండదు. దానికి ధోనిని మించిన బ్యాట్స్‌మన్ ఎవరూ ఉండరు. 3, 4 స్థానాల్లో కోహ్లి, ధోని ఆడే జట్టును దెబ్బ తీయడం ఏ ప్రత్యర్థికీ అంత సులువు కాదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సగంకంటే ఎక్కువ ఓవర్లు (27.1) క్రీజ్‌లో కలిసి ఆడటంతో మ్యాచ్ దిశను మార్చడం సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 151 పరుగులు జోడించడంతోనే మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చింది. వీరిద్దరి మధ్య ఉండే సమన్వయం జట్టు పనిని సులువు చేస్తుందనడంలో సందేహం లేదు. ‘నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే నాకు విరాట్‌తో కలిసి ఆడే అవకాశం వస్తుంది. మేమిద్దరం వికెట్ల మధ్య చాలా వేగంగా పరుగెత్తుతాం. పరుగు లేని చోట సింగిల్, సింగిల్ అనుకున్న చోట రెండు పరుగులు తీసి అత్యుత్తమ ఫీల్డర్లపై కూడా ఒత్తిడి పెంచగలం. మధ్య ఓవర్లలో వందకుపైగా పరుగులు భాగస్వామ్యం ఒకటి నమోదైతే ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ పని సులువవుతుంది’ అని మహి విశ్లేషించాడు. నాలుగో స్థానంలో ఆడినప్పుడు కూడా అతని రికార్డు అద్భుతంగానే ఉంది. 24 వన్డేల్లో ధోని 61.63 సగటుతో 1171 పరుగులు సాధించాడు. ఒక వైపు ధోని కెరీర్ చివరి దశలో ఉండగా, మరో వైపు 2019 వరల్డ్ కప్ జట్టును నిర్మించే ప్రయత్నాలు సాగుతున్నారుు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది. మ్యాచ్‌లో నాలుగో స్థానంతో బరిలోకి దిగినప్పుడు ఇతర ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా లభిస్తుంది. రైనాను ఇక నమ్మలేని పరిస్థితి ఉండటంతో ధోనికి నాలుగు సరైన స్థానంగా కనిపిస్తోంది. అదే కొనసాగితే ఇక భారత్ మరో ఫినిషర్‌ను వెతుక్కోవాల్సి వస్తుంది. అది పాండేనా, పాండ్యానా, మరొకరా అనేది త్వరలో తేలుతుంది!

మరిన్ని వార్తలు