సీనియర్లకు విశ్రాంతినిస్తారా!

29 Jun, 2015 00:05 IST|Sakshi
సీనియర్లకు విశ్రాంతినిస్తారా!

 సందిగ్ధంలో సెలక్షన్ కమిటీ
 జింబాబ్వే పర్యటనకు నేడు భారత జట్టు ఎంపిక

 
 న్యూఢిల్లీ: ఒకవైపు సుదీర్ఘ సీజన్ తర్వాత బాగా అలసిపోయామంటూ ధోని తదితరులు విశ్రాంతి కోరుతున్నారు. మరోవైపు చిన్న సిరీసే కదా ఆడితే ఏముంది, తర్వాత నాలుగు నెలలు ఎలాగూ విశ్రాంతి ఉందనేది బోర్డు పెద్దల వాదన. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం (నేడు) ఇక్కడ సమావేశం కానుంది. ఈ టూర్‌లో భాగంగా భారత్, జింబాబ్వే మూడు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఇదే సమావేశంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్లతో జరిగే ముక్కోణపు సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును కూడా ఎంపిక చేస్తారు.
 
 కెప్టెన్ ఎవరు?
 జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకుండా తమకు విశ్రాంతి ఇవ్వాలని ఇప్పటికే ధోని, విరాట్ కోహ్లి, అశ్విన్ రవిచంద్రన్, ఉమేశ్ యాదవ్, రోహిత్ శర్మ బోర్డును కోరినట్లు సమాచారం. అయితే వీరిలో కోహ్లి, అశ్విన్‌లతో పాటు గాయాలకు గురి కాకుండా ఉమేశ్‌కు కూడా బ్రేక్ లభించవచ్చు. ధోని టెస్టుల నుంచి ఎలాగూ తప్పుకున్నాడు కాబట్టి ఈ సిరీస్‌కు అతను ఉంటే మంచిదని, ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్ వరకు వన్డేలు లేవని బీసీసీఐలోని కీలక వ్యక్తి ఒకరు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా రోహిత్ శర్మకు కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే కమిటీ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. ఒక వేళ ధోనికి విరామం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మాత్రం రైనా, రోహిత్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేయవచ్చు. 2010 జింబాబ్వే టూర్‌లో సురేశ్ రైనా కెప్టెన్‌గా వ్యవహరించినా... భవిష్యత్తు కెప్టెన్‌గా సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం రోహిత్ శర్మను పరీక్షించే ప్రయత్నం చేయవచ్చు.
 
 ఎవరికి చాన్స్!
 జట్టులో ఖాయంగా ఉండే ఆటగాళ్లలో అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్నీ, మోహిత్  శర్మ ఉన్నారు. అశ్విన్ తప్పుకుంటే జమ్మూ కశ్మీర్ ఆఫ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్‌కు చోటు దక్కవచ్చు. హర్భజన్ టెస్టు టీమ్‌లో ఉన్నా, యువ ఆటగాడిగా రసూల్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక రాబిన్ ఉతప్ప, వరుణ్ ఆరోన్, సంజు శామ్సన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా భారత ‘ఎ’ జట్టు తొలిసారి దక్షిణాఫ్రికా ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్లతో ముక్కోణపు సిరీస్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో మరీ జూనియర్లు కాకుండా అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లతో తనకు పటిష్టమైన జట్టును ఇవ్వాలని ద్రవిడ్ కోరినట్లు తెలిసింది. ఈ టీమ్‌కు పుజారా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. వచ్చే నెల 19 నుంచి చెన్నై, వాయనాడ్‌లలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా