‘ధోనితో కలిసి ‘పరుగు’ను మర్చిపోలేను’

12 Sep, 2019 13:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెటర్లలో ఫిట్‌నెస్‌పై అత్యంత ఎక్కువ శ్రద్ధ పెట్టేది ఎవరైనా ఉన్నారంటే అది కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినే.  ఫిట్‌నెస్‌ విషయంలో చాలామంది టీమిండియా క్రికెటర్లు సైతం కోహ్లిని ఫాలోవుతున్నారనేది వాస్తవం. కఠోరమైన సాధనతో పాటు ఆహార నియావళిలో కూడా కోహ్లి చాలా కచ్చితత్వంతో ఉంటాడు. ఒక అథ్లెట్‌ అనేవాడు ఫిట్‌గా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడనేది కోహ్లి నమ్మకం. అయితే కోహ్లికి ఒక ఫిట్‌నెస్‌ టెస్టు ఎదురైందట. అది కూడా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ద్వారానే ఫిట్‌నెస్‌ టెస్టును చవిచూడాల్సి వచ్చిందని కోహ్లి పేర్కొన్నాడు.

ఒక వరల్డ్‌ టీ20 మ్యాచ్‌లో ధోనితో కలిసి పరుగులు చేయడానికి అపసోపాలు పడ్డానని, కాకపోతే ధోనితో చేసిన ఆ పరుగుల్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఆ మ్యాచ్‌నే ఎప్పటికీ మర్చిపోలేనని కోహ్లి తెలిపాడు. ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌లో ధోని ఘనతను గుర్తు చేసుకుంటూ ఒక ట్వీట్‌ పోస్ట్‌ చేశాడు కోహ్లి. ‘ ఆ గేమ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. అదొక ప్రత్యేకమైనది. ఈ మనిషి పరుగుల విషయంలో ఒక పరీక్ష పెట్టాడు. అది ఫిట్‌నెస్‌ టెస్టులా అనిపించింది’ అని కోహ్లి తెలిపాడు.

 2016 వరల్డ్‌ టీ20లో భాగంగా సూపర్‌10లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కు చేరింది. ఆసీస్‌ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 49కి మూడు,  94 పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కోహ్లితో జత కలిసిన ధోని మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను విజయా తీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో ధోని 18 పరుగులతో అజేయంగా నిలిచినా, 67 పరుగుల్ని జత చేయడంలో భాగమయ్యాడు. అదే సమయంలో కోహ్లి 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సందర్భాన్ని మరోసారి గుర్తు చేసుకున్న కోహ్లి.. ధోనితో కలిసి పరుగులు చేయడం ఫిట్‌నెస్‌ టెస్టును తలపించిందన్నాడు.

మరిన్ని వార్తలు