అది ‘మాస్టర్‌’ ప‍్లాన్‌: సెహ్వాగ్‌

6 Apr, 2020 13:27 IST|Sakshi
2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో విజయం సాధించిన తర్వాత ధోని-యువీల అభివాదం

టీమిండియా రెండో సారి వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన క్షణాలు ప్రతీ భారతీయుడి మదిలో కదలాడుతూనే  ఉంటాయి. 2011లో ధోని నేతృత్వంలోని టీమిండియా వరల్డ్‌కప్‌ను అందుకోవడంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామానికి బ్రేక్‌ పడింది. ప్రత్యేకంగా ఆ ఫైనల్‌ మ్యాచ్‌లో  ధోని సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్‌ చేయడం చెరగని ముద్రగానే మిగిలిపోయింది. ఇటీవలే ఆ వరల్డ్‌కప్‌ గెలిచి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది.  శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్‌ పోరులో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది.లంకేయులు నిర్దేశించిన 275 పరుగుల టార్గెట్‌ ఛేదనలో భాగంగా సచిన్‌ టెండూల్కర్‌(18), వీరేంద్ర సెహ్వాగ్‌(0)లు నిరాశపరిచినా, గౌతం గంభీర్‌(97), ఎంఎస్‌ ధోని(91 నాటౌట్‌)లు రాణించి గెలుపులో కీలక పాత్ర పోషిస్తే, విరాట్‌ కోహ్లి(35), యువరాజ్‌(21 నాటౌట్‌)లు తమ వంతు పాత్ర పోషించారు.(మమ్మల్ని ఎందుకు మరిచావ్‌?: యువీ)

అయితే ఆనాటి మ్యాచ్‌కు సంబంధించి కొన్ని విషయాలను అప్పటి విజయంలో భాగమైన వీరేంద్ర సెహ్వాగ్‌ షేర్‌ చేసుకున్నాడు. ప్రధానంగా యువరాజ్‌ సింగ్‌ కంటే ఎంఎస్‌ ధోనిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపడం  వెనుక మాస్టర్‌  బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నాడనే విషయాన్ని ధృవీకరించాడు. ఈ  విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్యూలో సచిన్‌ టెండూల్కర్‌  తెలపగా,  అది నిజమేనని సెహ్వాగ్‌ స్పష్టం చేశాడు. ఆ సమయంలో తాను సచిన్‌ పక్కనే కూర్చొని ఉన్నానని తెలిపిన సెహ్వాగ్‌.. లెఫ్ట్‌ హ్యాండ్‌-రైట్‌ హ్యాండ్‌ కాంబినేషన్లను కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఆ విషయాన్ని కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్‌ దృష్టికి తీసుకెళ్లాడన్నాడు. దానికి కిర్‌స్టెన్‌ కూడా ఒప్పుకోవడంతో ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పైకి వచ్చాడన్నాడు. ఆ విషయాన్ని ధోనికి చెప్పడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి సిద్ధమయ్యాడన్నాడు.  ఆ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌-సచిన్‌లు ఓపెనర్లగా రాగా,  ఫస్ట్‌డౌన్‌లో గౌతం గంభీర్‌, సెకండ్‌ డౌన్‌లో విరాట్‌ కోహ్లి వచ్చాడు. ఇక కోహ్లి ఔటైన తర్వాత యువరాజ్‌ రావాల్సి ఉండగా,  ఫీల్డ్‌లో ఉన్నది లెఫ్ట్‌ హ్యాండ్‌ ఆటగాడు గంభీర్‌ కాబట్టి, ధోని థర్డ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా గంభీర్‌ ఔటైన సందర్భంలో యువరాజ్‌ సింగ్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. 

>
మరిన్ని వార్తలు