13న 'ధోని' రిటైర్‌మెంట్‌ !

4 Dec, 2017 18:28 IST|Sakshi

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డే అనంతరం ధోని తన కెరీర్‌కు ముగింపు పలకబోతున్నాడు. మొహాలీలో జరగనున్న రెండో వన్డే అనంతరం రిటైర్‌ అవబోతున్నాడు. ధోని ఏంటీ రిటైర్మెంట్‌ ఏంటీ అనుకుంటున్నారా... అవునండీ ధోని రిటైర్‌ అవబోతున్నాడు. అయితే ఇక్కడ చెప్పేది భారత మాజీ కెప్టెన్‌ ఎం ఎస్‌ ధోని గురించి కాదు. మొహాలీ పోలీసు భద్రతా జాగిలం ధోని గురించి..

పంజాబ్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న జాగిలం ధోని రిటైర్‌ కాబోతోంది. గత పదేళ్లుగా మొహాలీ జిల్లా పోలీసులకు ఈ స్నిఫర్‌ డాగ్‌ విశేష సేవలు అందిస్తోంది. ధోని కెరీర్‌ మంచి ఊపు మీద ఉన్న సమయంలో భద్రత విభాగంలోకి వచ్చిన ఈ జాగిలానికి ధోని పేరుపెట్టుకున్నారు. ధోని గ్రౌండ్‌లో విజృంభిస్తే ఈ స్నిఫర్‌ డాగ్‌ డ్యూటీలో రెచ్చిపోయేదని పోలీసు వర్గాలు తెలిపాయి. మొహాలీలో డిసెంబర్‌ 13న శ్రీలంకతో జరిగే రెండో వన్డే అనంతరం ఈజాగిలం సేవలకు అధికారులు స్వస్తి పలకనున్నారు. ఇందుకోసం పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 2011 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ఇరు దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఈ స్నిఫర్‌ డాగ్‌తోనే తనిఖీ చేశారు.

ఇది రోజుకు ఏడు గంటలే నిద్రపోయేదని, ప్రేలుడు పదార్ధాలు, బాంబులను పసిగట్టడంలో దిట్ట అని పోలీసులు తెలిపారు. ఎవరైన దీనిని దత్తత తీసుకోవాలి అంటే నామమాత్రపు ధర రూ.800లకే ఇస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు