ధోనిపై ఇషాంత్‌ ఘాటు వ్యాఖ్యలు..!

29 Dec, 2019 12:06 IST|Sakshi

న్యూఢిల్లీ:  గత కొన్నేళ్లుగా భారత పేస్‌ ఎటాక్‌లో ఇషాంత్‌ శర్మ ఒక పిల్లర్‌గా కొనసాగుతున్నాడు.  2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాంత్‌ శర్మ.. రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, ఎంఎస్‌ ధోనిల కెప్టెన్సీలో ఆడాడు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లి నేతృత్వంలో రెగ్యులర్‌ టెస్టు పేసర్‌గా ఉన్నాడు. అయితే స్పిన్నర్లను ఎక్కువగా అందించే భారత్‌లో పేస్‌ విభాగం ఇటీవల కాలంలో బాగా రాటు దేలింది. ఆ మార్పు ఎందుకు వచ్చిందనే ఇషాంత్‌ శర్మను అడగ్గా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఇక్కడ ధోని సమయంలో తనకు ఎక్కువగా అవకాశాలు రాకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు.అసలు ఫాస్ట్‌ బౌలర్లకు నిలకడగా ధోని ఎప్పుడు అవకాశాలు ఇచ్చాడంటూ ఇషాంత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘ధోని కెప్టెన్సీలో ఫాస్ట్‌ బౌలర్లjకు ఎక్కువగా రొటేషన్‌ పద్ధతిలో అవకాశాలు మాత్రమే వచ్చేవి. ధోని ఎప్పుడూ ఫాస్ట్‌ బౌలర్లను మార్చుతూనే ఉండేవాడు. అది అప్పట్లో  ఏ ఒక్క ఫాస్ట్‌ బౌలర్‌కి ఉపయోగపడలేదు.  ఇలా చేయడం వల్ల మాలో నిలకడ లోపించేది. నిలకడను సాధించడానికి ధోని అవలంభించిన పేసర్ల రొటేషన్‌ పద్ధతి ఉపయోగం లేకుండా పోయింది. ఇలా చేయడం వల్ల మాలో అనుభవలేమి ఎక్కువగా కనబడేది. టీమిండియాకు ధోని కెప్టెన్సీ చేసిన సమయాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. మాలో కొంతమందికి ఎక్కువ అనుభవం ఉండేది కాదు. అదే సమయంలో పేసర్లను తరచు రొటేట్‌ చేసేవాడు.

అందుచేత ఏ ఒక్క పేసర్‌ నిలకడ సాధించలేక సతమతమయ్యే వాళ్లం. ఇప్పుడు ఒక పూల్‌లో మూడు నుంచి నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు ఉండటం వల్ల మా మధ్య సమన్వయం కరెక్ట్‌గా ఉంటుంది. అంతకముందు 6 నుంచి 7గురు ఫాస్ట్‌ బౌలర్లు ఉండేవారు.. మా మధ్య కమ్యూనికేషన్‌ సరిగా ఉండేది కాదు. ధోని అవలంభించిన రొటేషన్‌ విధానంతో మాకు లాభం చేకూరలేదు’ అని ఇషాంత్‌ పేర్కొన్నాడు.  ఇక విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో జట్టు పూర్తి స్థాయిలో మారిపోయిందన్నాడు. ఫాస్ట్‌ బౌలర్లకు పెద్ద పీట వేయడంతో మనం కూడా బలమైన పేస్‌ ఎటాక్‌ ఎదిగామన్నాడు. కోహ్లి నేతృత్వంలో ఫాస్ట్‌ బౌలర్లు విశేషంగా రాణించడానికి వారికి నిలకడగా అవకాశాలు రావడమేనన్నాడు. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో భారత్‌కు టెస్టు సిరీస్‌ ఉంది. అంతకుముందుగానే పరిమిత ఓవర్ల సిరీస్‌ ఉన్నప్పటికీ రాబోవు సీజన్‌లో భారత్‌ టెస్టు సిరీస్‌ మాత్రం కివీస్‌తోనే ఆరంభం కానుంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్‌ ఎనిమిది వికెట్లు సాధించాడు. ప్రతీ ఇన్నింగ్స్‌లోనూ నాలుగేసి వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని వార్తలు