‘ధోని.. నీకు నువ్వే తప్పుకో’

20 Sep, 2019 10:33 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించి తనకంటూ ప్రత్యేక ముద్ర సంపాదించుకున్న మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌ గురించి గత కొంత కాలంగా కామెంట్లు  వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ధోని తన రిటైర్మెంట్‌లో భాగంగానే భారత జట్టుకు దూరమయ్యాడనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సైతం ధోని ఎంపిక చేయకపోవడం ఇందుకు మరింత బలాన్ని ఇచ్చింది. వీటిపై చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌ ప్రసాద్‌తో పాటు ధోని భార్య సాక్షి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.  ప్రధానంగా భారత క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని కెరీర్‌ గురించే ఎక్కువ చర్చ నడుస్తుందనేది కాదనలేని వాస్తవం.

ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందని దిగ్గజ క్రికెటర్‌  సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ‘ప్రస్తుతం ధోని 38 ఏళ్ల వయసులో ఉన్నాడు. దాంతో భారత క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌  కచ్చితంగా అతని నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉంటుంది. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ నాటికి ధోనికి 39 ఏళ్లకు చేరతాడు. ఈ వయసులో క‍్రికెట్‌ ఆడటం చాలా కష్టం. అసలు ధోని మనసులో  ఏముందో ఎవరికీ తెలియదు. కేవలం అతను మాత్రమే తన క్రికెట్‌ కెరీర్‌ గురించి చెప్పగలడు. ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంటుంది. అదే వేరే విషయం.  నేను కూడా ధోని అత్యంత గౌరవం ఇస్తాను.. ధోనికి లక్షల  సంఖ్యలో ఎలా అయితే అభిమానులు ఉన్నారో, నేను అందులో ఒకడ్ని. ధోనిపై గౌరవంతో చెబుతున్నా. ధోనికి ఉద్వాసన చెప్పే సమయం కోసం వేచి చూడకుండా అతనే గౌరవంగా వీడ్కోలు చెబితే బాగుంటుంది. ధోని రిటైర్మెంట్‌కు విలువ దక్కాలంటే అతనే తొందరగా నిర్ణయం తీసుకోవాలి’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు