దోస్తులతో కలిసి చిందేసిన ధోని

10 Nov, 2019 19:45 IST|Sakshi

రాంచీ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌, మాజీ సారథి ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌ అంశం పజిల్‌ను తలపిస్తోంది. ఈ జార్ఖండ్‌ డైనమెట్‌  క్రికెట్‌ మైదానంలోకి అడుగుపెట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది.. అయినా అతడి క్రికెట్‌ భవిత్యంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. చివరగా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై ధోని ఆడాడు. ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

విశ్రాంతి కాలం ముగిసి కూడా రెండు నెలలు కావస్తున్నా.. ధోని తిరిగి టీమిండియాకు ఆడతాడా లేడా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ధోని విషయంలో క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. అయితే రిటైర్మెంట్ అనేది అతడి వ్యక్తిగత నిర్ణయమని, అందులో ఎవరూ జో​క్యం చేసుకోబోరని తేల్చిచెప్పాడు. దీంతో ధోని ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం గందరగోళానికి గురవుతుంటే.. ధోని మాత్రం ఫుల్‌ బిందాస్‌గా ఉన్నాడు.  

రాంచీకి దగ్గరల్లోని తన ఫామ్‌హౌజ్‌లో చిన్ననాటి స్నేహితులతో కలిసి ధోని చిల్‌ అవుతున్నాడు. చిన్ననాటి స్నేహితుడు లోహానీ బర్త్‌డే వేడుకలను ధోని తన ఫామ్‌హౌజ్‌లో ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకులో ధోని స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. ‘మైదానంలో కిష్ట సమయంలో కూల్‌గా ఉన్నావ్‌.. అలాగే నీ రిటైర్మెంట్‌పై అందరూ గందరగోళానికి గురవుతున్నా నువ్వు మాత్రం అంతే కూల్‌గా చాలా రిలాక్స్‌గా ఉన్నావ్‌. నీ ఈ సహజ గుణాన్నే అందరూ నీ దగ్గరి నుంచి నేర్చుకోవాలి’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఇక అంతకుముందు తన ఇంట్లోని కుక్కలతో సరదగా ఆడుకోవడం, జీవా ధోనితో కలసి అల్లరి చేయడం వంటి వీడియోలను ధోని షేర్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు ధోని రిటైర్మెంట్‌ తీసుకోకపోవడమే టీమిండియాకు లాభమని సీనియర్‌ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ధోని వారసుడిగా పంత్‌ విఫలమవుతుండటం, అంతేకాకుండా అతడి స్థానాన్ని భర్తీ చేయగల క్రికెటర్‌ సమీప భవిష్యత్‌లో ఎవరూ లేకపోవడంతో ధోని అవసరం టీమిండియాకు ఇంకా ఉందని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు