ధోని 'సిక్సర్ల' రికార్డు!

9 Jun, 2017 16:44 IST|Sakshi
ధోని 'సిక్సర్ల' రికార్డు!

లండన్:టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సాధించాడు. విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ధోని అరుదైన ఫీట్ ను నెలకొల్పాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా భారత్ తరపున అత్యధిక విదేశీ సిక్సర్ల రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో ధోని 52 బంతుల్లో7 ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. ఇక్కడ ధోని రెండు సిక్సర్లు సాధించడంతో భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు.

 

ఇప్పటివరకూ విదేశాల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడి రికార్డు గంగూలీ పేరిట ఉండేది. 296 విదేశీ అంతర్జాతీయ మ్యాచ్ ల్లో గంగూలీ 159 సిక్సర్లు కొట్టగా, ఆ రికార్డును 281 మ్యాచ్ ల్లో ధోని సవరించాడు. ప్రస్తుతం ధోని 161 విదేశీ సిక్సర్లతో తొలిస్థానంలో ఉన్నాడు. శ్రీలంకత మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. భారత జట్టు నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని సంచలనాలకు మారుపేరైన శ్రీలంక సునాయాసంగా ఛేదించింది. దాంతో గ్రూప్-బిలో సెమీస్ రేసు రసకందాయంలో పడింది. ప్రస్తుతం భారత్, శ్రీలంక, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలో లు తలో మ్యాచ్ లో గెలవడంతో సెమీస్ కు ఎవరు చేరతారు అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

 

మరిన్ని వార్తలు