కొత్త బాధ్యత

23 May, 2016 23:52 IST|Sakshi
కొత్త బాధ్యత

జింబాబ్వేతో సిరీస్‌కు ధోనియే కెప్టెన్
 
తొలిసారి జట్టులోకి ఆరుగురు
ఫైజ్ ఫజల్‌కు అనూహ్య అవకాశం

 
దాదాపు తొమ్మిదేళ్ల కెప్టెన్సీలో దిగ్గజ ఆటగాళ్లతో పాటు తన సమకాలికులతోనూ, జూనియర్లతోనూ జట్లను నడిపించి అద్భుత విజయాలు సాధించిన నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. కెరీర్ చివర్లో ఇప్పుడు మరింత మంది కొత్త కుర్రాళ్లకు మార్గదర్శనం చేసే బాధ్యతను అతనిపై బీసీసీఐ పెట్టింది. వన్డే, టి20ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటించనున్న ‘యంగ్ బ్రిగేడ్’ను అతను నడిపించనున్నాడు. ఈ బృందంలో టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులోకి తొలిసారి ఎంపికైనవారు ఆరుగురు ఉండటం విశేషం.
 

 
ముంబై: వచ్చే వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటినుంచి కుర్రాళ్లను గుర్తించి, తీర్చిదిద్దాలని బీసీసీఐ నిర్ణయించిందా...లేక రాబోయే రోజుల్లో భారత జట్టు ఎక్కువగా టెస్టులు మాత్రమే ఆడనుంది కాబట్టి విరామం వద్దంటూ ధోని తానే సిద్ధమయ్యాడా...ఈ సిరీస్‌తో అతని కెప్టెన్సీ ముగుస్తుందా... కారణమేదైనా వన్డే, టి20 సిరీస్‌ల కోసం 16 మంది సభ్యుల జట్టు ప్రకటన కాస్త ఆశ్చర్యపరిచింది. గత ఆస్ట్రేలియా పర్యటననుంచి టి20 ప్రపంచ కప్ వరకు భారత వన్డే, టి20 జట్టులో సభ్యులుగా ఉన్న 17 మందిని  ఈ సిరీస్‌కు పక్కన పెట్టడం విశేషం! సీనియర్లలో ధోని ఒక్కడే ఇప్పుడు జింబాబ్వేకు వెళుతున్నాడు. జూన్ 11నుంచి 22 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, 3 టి20ల్లో జింబాబ్వేతో తలపడుతుంది.


 ధోనిలో మూడో వంతు
ఈ టూర్ కోసం ఎంపికైన జట్టులో ధోని ఒక్కడే 275 వన్డేలు, 68 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. మిగతా 15 మంది కలిపి ఆడిన మ్యాచ్‌లు 83 వన్డేలు, 28 టి20లు మాత్రమే. ఈ జట్టుకు ఎంత అనుభవం ఉందో దీన్ని బట్టే తెలుస్తోంది. ‘మేం ఎవరికీ విశ్రాంతి ఇవ్వలేదు. ఏ ఆటగాడు కూడా తాను అందుబాటులో ఉండనని, తనను ఎంపిక చేయవద్దని కోరలేదు కూడా. జింబాబ్వేకు యువ జట్టును, విండీస్‌కు మరో జట్టును ఎంపిక చేయడమనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ నిర్ణయమే’ అని కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. అయితే వన్డేలు, టి20లు రెగ్యులర్‌గా ఆడుతున్న కోహ్లి, రోహిత్, అశ్విన్, ధావన్‌లాంటి ఆటగాళ్లకు కాస్త బ్రేక్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువగా క్రికెట్ ఆడని రైనా, యువరాజ్, జడేజా, భువనేశ్వర్‌లను ఎందుకు పక్కన పెట్టినట్లో! పైగా వరల్డ్ కప్ మొత్తం కూర్చున్నా ఒక్క మ్యాచ్ ఆడని హర్భజన్, నేగి, ఇంకా కెరీర్ ఆరంభ దశలోనే ఉన్న హార్దిక్ పాండ్యాలను కూడా తప్పించి సెలక్టర్లు ఏం చెప్పదల్చుకున్నారు? అటు విశ్రాంతి కాకుండా ఇటు వేటు వేయకుండా 17 మందిని పక్కన పెట్టడం నిజంగా ఆశ్చర్యకరం.


ఎలా వచ్చారంటే..?
జట్టు సభ్యులలో  కేఎల్ రాహుల్ టెస్టు జట్టులో రెగ్యులర్ కాగా, వన్డేలకు మాత్రం ఇప్పుడే ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో చెలరేగడం అతనికి కలిసొచ్చింది. కరుణ్ నాయర్ గత ఏడాది శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా, మ్యాచ్ లభించలేదు. ఇతనూ ఐపీఎల్ ప్రదర్శనతోనే వచ్చాడు. మిగతా నలుగురు మన్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్, జయంత్ యాదవ్, ఫైజ్ ఫజల్‌లకు భారత జట్టు పిలుపు రావడం ఇదే తొలిసారి. విజయ్ హజారే ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలవడం మన్‌దీప్‌కు, ఐపీఎల్‌లో ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉండటం చహల్ ఎంపికకు కారణమయ్యాయి. టి20ల్లో 6కంటే తక్కువ ఎకానమీ ఉన్న హర్యానా ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్‌కు మొదటి అవకాశం దక్కింది. 2011 తర్వాత ఐపీఎల్‌లో ఏ జట్టుకూ ఆడని 30 ఏళ్ల ఫైజ్ ఫజల్‌కు తొలిసారి టీమిండియా చాన్స్ రావడం విశేషం. విదర్భ జట్టుకు చెందిన ఫజల్ ఈ ఏడాది నాలుగు దేశవాళీ టోర్నీలు ఇరానీ, దేవధర్, విజయ్‌హజారే, ముస్తాక్ అలీలో నిలకడగా రాణించాడు. ప్రస్తుతం అతను ఇంగ్లండ్‌లో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు.
 
 జింబాబ్వేతో వన్డే, టి20లకు జట్టు
 ఎంఎస్ ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఫైజ్ ఫజల్, మనీశ్ పాండే, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, రిషి ధావన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, జస్‌ప్రీత్ బుమ్రా, బరీందర్ శరణ్, మన్‌దీప్ సింగ్, కేదార్ జాదవ్, జైదేవ్ ఉనాద్కట్, యజువేంద్ర చహల్.

జింబాబ్వే సిరీస్ షెడ్యూల్
జూన్ 11: తొలి వన్డే, జూన్ 13: రెండో వ న్డే
జూన్ 15: మూడో వన్డే, జూన్ 18: తొలి టి20
జూన్ 20: రెండో టి20, జూన్ 22: మూడో టి20
8 అన్ని మ్యాచ్ లు హరారేలో జరుగుతాయి.
8  వన్డేలు మ. 12.30 నుంచి, టి20లు సా. 4.30 నుంచి.

 
 
దేశవాళీ ప్రతిభకు గుర్తింపు: గవాస్కర్
న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటన కోసం భారత వన్డే జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభ చూపిన ఆటగాళ్లను జాతీయ సెలక్షన్ కమిటీ గుర్తించడం అభినందనీయమని అన్నారు. ‘దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ఆటగాళ్లను ఎంపిక చేయడం సంతోషం కలిగించింది.  ఐపీఎల్ కూడా దేశవాళీయే అని వాదిస్తారు. కానీ రంజీ, ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో చూపిన ప్రదర్శనను జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలి’ అని అన్నారు.
 
 
 వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టు
విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, స్టువర్ట్ బిన్నీ, శార్దూల్ ఠాకూర్.

వెస్టిండీస్‌లో టెస్టులు జూలై-ఆగస్టులో జరుగుతాయి. ఇంకా తేదీలు, వేదికలు ఖరారు కాలేదు.

మరిన్ని వార్తలు