మరో రికార్డు చేరువలో ధోని

12 Dec, 2017 17:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వన్డేల్లో 300 పైగా మ్యాచ్‌లు.. అత్యధిక నాటౌట్‌లు.. స్టంప్‌ అవుట్‌లతో ఈ ఏడాది రికార్డులు సృష్టించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మరో మైలు రాయి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో 10 వేల పరుగుల మార్క్‌ దాటడానికి ధోని ఇంకా 109 పరుగుల దూరంలో ఉన్నాడు.

భారత్‌-శ్రీలంక రేపటి మ్యాచ్‌లో ధోని ఈ పరుగులు చేస్తే వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా  రికార్డులకెక్కనున్నాడు. 259 ఇన్నింగ్స్‌ల్లో సచిన్‌ 10 వేల మార్క్‌ను అందుకోగా సౌరవ్‌ గంగూలీ 263, రికీ పాంటింగ్‌ 266, జయసూర్య 272 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను అందుకున్నారు. ధోని ప్రస్తుతం 267 ఇన్నింగ్స్‌ల్లో 9,891 పరుగులు చేశాడు. మిగిలిన 109 పరుగులను ఒక ఇన్నింగ్స్‌లో లేకపోతే రెండు మూడు, నాలుగు ఇన్నింగ్స్‌లు తీసుకున్నా జయసూర్య స్థానాన్ని అధిగమిస్తాడు. అంతేగాకుండా 10 వేల మార్క్‌ను అందుకున్న నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందనున్నాడు. ఈ జాబితాలో సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌లు ముందున్నారు. 

ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్లలో ధోని నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి(1460) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్‌ శర్మ(1078), శిఖర్‌ ధావన్‌(792), ధోని(781)లు తరువాతి వరుసలో ఉన్నారు. శ్రీలంకపై స్థిరమైన బ్యాటింగ్‌తో రాణిస్తున్న ధోని గత ఎనిమిది మ్యాచుల్లో 4 అర్థ సెంచరీలు సాధించాడు.

ఇక రేపటి మ్యాచ్‌లో మరో 11 పరుగులు చేస్తే ధోని  మోహాలీ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందుతాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సచిన్‌ పేరిట ఉంది. ఇక తొలి మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితిల్లో అర్ధసెంచరీతో భారత పరువును కాపాడిన ధోని మంచి ఫామ్‌లో ఉన్నాడు.

మరిన్ని వార్తలు