వారిద్దరి కెప్టెన్సీలో చాలా పోలికలున్నాయి: జహీర్‌

16 Apr, 2020 16:21 IST|Sakshi

న్యూఢిల్లీ: సౌరవ్‌ గంగూలీ-ఎంఎస్‌ ధోనిలు ఇద్దరూ భారత క్రికెట్‌ జట్టును ఉన్నత శిఖరంలో నిలిపిన కెప్టెన్లు. వీరిలో సౌరవ్‌ గంగూలీది దూకుడు స‍్వభావం అయితే, ధోని మాత్రం మిస్టర్‌ కూల్‌. కాగా, వీరిద్దరి కెప్టెన్సీలో చాలా దగ్గర పోలికలున్నాయినని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌. ప్రధానంగా యువ క్రికెటర్లకు అండగా నిలిచే విషయంలో గంగూలీ,ధోనిలు దాదాపు ఒకే విధంగా ఆలోచిస్తారని జహీర్‌ పేర్కొన్నాడు. తనలాంటి ఎంతో మంది క్రికెటర్లకు గంగూలీ నుంచి ఎలాంటి మద్దతు లభించిందో, ఆ తర్వాత తరానికి ధోని కెప్టెన్సీలో కూడా అలాంటి మద్దతే లభించిందన్నాడు. ప్రతీ దశాబ్దానికి భారత క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పు అనేది సహజంగానే జరుగుతూ వస్తుందన్నాడు. (ఆ వరల్డ్‌కప్‌ అంతా పెయిన్‌ కిల్లర్స్‌తోనే..!)

‘కెరీర్‌ మొదట్లో ఏ క్రికెటర్‌కైనా సీనియర్ల మద్దతు అవసరం. ముఖ్యంగా జట్టుకు సారథులుగా ఉండేవారి నమ్మకాన్ని ఏర్పరుచుకోవాలి. మనలోని ప్రతిభకు కెప్టెన్ల మద్దతు తోడైతే ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక సీనియర్ల అండ జూనియర్లకు ఎంతో అవసరం. గంగూలీ, ధోనిలు ఇద్దరూ చాలాకాలంపాటు భారత జట్టును నడిపించారు. ఇద్ద‌రిలో చాలా సారూప్య‌త‌లు ఉన్నాయి. కెరీర్ తొలినాళ్ల‌లో దాదా ఇచ్చిన మ‌ద్ద‌తు మ‌రువ‌లేను. అయితే ధోని చేతికి ప‌గ్గాలు వ‌చ్చిన‌ప్పుడు జ‌ట్టులో అంతా సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఉన్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం ఉన్న‌వాళ్ల‌ను ముందుకు న‌డిపించ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. కానీ ఒక్కొక్క‌రుగా సీనియ‌ర్లు త‌ప్పుకుంటుంటే.. అప్పుడు యువ ఆట‌గాళ్ల‌కు మార్గ‌నిర్దేశం చేసుకుంటూ జ‌ట్టును ముందుకు సాగించిన తీరు అద్భుతం. అచ్చం గంగూలీ‌లానే ధోని యువ ఆటగాళ్లకు అండగా ఉన్నాడు. దాంతోనే అద్భుతమైన ఫలితాలు సాధించాడు’ అని జహీర్‌ తెలిపాడు. (ధోనికి మద్దతుగా కైఫ్‌.. రాహుల్‌ వద్దు!)

మరిన్ని వార్తలు