ధోని లోగో తొలగించాల్సిందే

8 Jun, 2019 04:58 IST|Sakshi

ఐసీసీ స్పష్టీకరణ ∙బీసీసీఐ విజ్ఞప్తి తిరస్కరణ

లండన్‌: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని దేశభక్తిపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నీళ్లు చల్లింది. ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ లోగోను వికెట్‌ కీపింగ్‌ గ్లౌజ్‌ల నుంచి తొలగిం చాల్సిందేనని స్పష్టం చేసింది. లోగోను అనుమతించాల్సిందిగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. ‘ధోని గ్లౌజ్‌లపై లోగోను అనుమతించలేం. ఈ విషయాన్ని బీసీసీఐకి తెలిపాం. ఆటగాళ్ల దుస్తులు, సామాగ్రిపై వ్యక్తిగత సందేశాలు, లోగోలు ప్రదర్శించడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐసీసీ రూల్స్‌ బుక్‌లో వికెట్‌ కీపింగ్‌ గ్లౌజ్‌లపై ఒకే ఒక్క స్పాన్సర్‌ లోగోకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేసింది.

ఇప్పటికే ధోని గ్లౌజ్‌లపై ‘ఎస్‌జీ’ లోగో ఉంది. మొదట్నుంచి బలిదాన్‌ బ్యాడ్జ్‌ లోగో అంశంలో బీసీసీఐ ధోనికి మద్దతుగా నిలిచింది. లోగో ఉన్న గ్లౌజ్‌లు కొనసాగించేందుకు ఐసీసీ అనుమతి కోరింది. పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ మాట్లాడుతూ ‘ఆ లోగోతోనే ధోని బరిలోకి దిగేలా అనుమతించాలని భారత బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వాణిజ్య, మత, ఆర్మీకి సంబంధించిన లోగోలను ఆటగాళ్లు ప్రదర్శించరాదు. నిజానికి అతడు ధరించింది పారామిలిటరీ ‘బలిదాన్‌’ గుర్తు కాదు. అలాంటపుడు ఇది నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎలా అవుతుంది’ అని అన్నారు.  

ధోని వెన్నంటే క్రీడాలోకం...
మరోవైపు భారత క్రీడాలోకం ధోని వెన్నంటే నిలిచింది. ఆర్మీ లోగో తీయాల్సిన అవసరం లేదని సామాజిక మాధ్యమాల్లో ట్వీట్‌లు, పోస్ట్‌లు పోటెత్తుతున్నాయి. ‘ధోని కీప్‌ ద గ్లౌజ్‌’ (ధోని లోగో కొనసాగించాలి) అనే హ్యాష్‌ట్యాగ్‌ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ సహచరుడు సురేశ్‌ రైనా ‘దేశాన్ని ప్రేమిస్తాం. ధోనిని సమర్థిస్తాం. అమరులైన మా హీరోల్ని గౌరవిస్తాం’ అని ట్వీట్‌ చేశాడు. ‘లోగో తొలగించాలనడం భారత ఆర్మీని అవమానపరచడమే అవుతుంది. ధోని లోగోతో ఆడతాడు. మేం అతని వెన్నంటే ఉంటాం’ అని  రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌ అన్నారు. ఆర్పీ సింగ్‌ తదితర క్రికెటర్లు కూడా లోగో కొనసాగించాల్సిందేనని ధోనికి మద్దతు పలికారు.

మరిన్ని వార్తలు