‘ధోని సీటును అలానే ఉంచాం’

28 Jan, 2020 12:44 IST|Sakshi

ఆక్లాండ్‌: వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత భారత క్రికెట్‌ జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి ఇప్పటికీ సహచర క్రికెటర్ల నుంచి గౌరవం లభిస్తూనే ఉంది. భారత జట్టులో కొనసాగాలా వద్దా.. అనేది ధోనికే వదిలేశామని, వరల్డ్‌ టీ20కి అందుబాటులో ఉంటాడా.. లేదా అనేది అతని నిర్ణయంపైనే ఆధారపడుతుందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ధోనిని మిస్‌ అవుతున్నామనే ఫీలింగ్‌ మాత్రం జట్టు సభ్యుల్లో ఇంకా కొట్టొచ్చినట్లు కనబడుతూనే ఉంది. 

తాజాగా ఇదే విషయాన్ని టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ వెల్లడించాడు. ‘ ధోనిని మేము చాలా మిస్సవుతున్నాం.  ఆఖరికి బస్సులో అతను కూర్చొనే కార్నర్‌ సీటును కూడా అలానే ఉంచాం. ఆ ప్లేస్‌లో ఎవరూ కూర్చోవడం లేదు’ అని చహల్‌ పేర్కొన్నాడు. ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో విజయం సాధించిన టీమిండియా.. హామిల్టన్‌లో బుధవారం జరుగనున్న మూడో టీ20 కోసం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఆక్లాండ్‌ నుంచి హామిల్టన్‌కు బస్సులో టీమిండియా సభ్యులు వెళుతున్న క్రమంలో పలువుర్ని చహల్‌ ఇంటర్యూ చేశాడు. ఇలా కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రాలను ఇంటర్యూ చేసిన చహల్‌.. బస్సులో ధోని కూర్చొనే చోటు వద్దకు వెళ్లి దీన్ని ఇలాగే ఖాళీగా ఉంచామన్నాడు. ఇది లెజెండ్‌ ధోని కూర్చొనే చోటని, ఈ స్థానంలో తాము కూర్చొవడం లేదన్నాడు.

2019లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ధోని అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ధోని పునరాగమనంపై ఇప్పటికే పలు రకాలు రూమర్లు చక్కర్లు కొట్టినా, టీ20 వరల్డ్‌కప్‌కు అందుబాటులో ఉంటాడని మరో వాదన వినిపిస్తోంది. అయితే ఇటీవల భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ధోని పేరును తొలగించారు. ధోనికి ఏ కేటగిరీలోనూ బీసీసీఐ చోటు కల్పించలేదు. ఫలితంగా ధోని శకం ముగిసిందంటూ రకరకాల కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో అంటే ధోనిని కాంట్రాక్ట్‌ నుంచి తొలగించిన రోజు ధోని మళ్లీ బ్యాట్‌ పట్టాడు. రాంచీలో జార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసి వైట్‌బాల్‌తో ప్రాక్టీస్‌ చేశాడు.


 

>
మరిన్ని వార్తలు