హాకీ ‘మాంత్రికుడి’ని గౌరవిద్దాం

20 Jul, 2013 05:18 IST|Sakshi
హాకీ ‘మాంత్రికుడి’ని గౌరవిద్దాం

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ కోసం హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. బుధవారం జరిగిన సమావేశంలో ఈ అవార్డు కోసం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ధ్యాన్‌చంద్ పేర్లపై తీవ్ర చర్చ జరిగింది. అయితే ఒలింపిక్స్‌లో హాకీ జట్టుకు మూడు స్వర్ణ పతకాలు అందించిన ఈ లెజెండ్ వైపే క్రీడా శాఖ మొగ్గుచూపింది.
 
  సరైన కారణంతోనే ఈ హాకీ వీరుడి పేరును ప్రతిపాదించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికీ చురుగ్గా క్రీడల్లో పాల్గొంటున్న వ్యక్తికి భవిష్యత్‌లోనైనా ఈ అవార్డు సాధించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ‘భారత రత్న అవార్డు కోసం కేవలం ఒక్కరి పేరునే పంపాలనుకున్నాం. దీంతో మేం ధ్యాన్‌చంద్ పేరును ఖరారు చేశాం. సచిన్‌పై గౌరవం ఉన్నా భారత క్రీడారంగంలో ధ్యాన్ ఓ సమున్నత వ్యక్తి. అదీగాకుండా చాలా టోర్నీలకు మనం ధ్యాన్‌చంద్ పేరును పెట్టుకున్నాం. ఈ అవార్డుకు ఆయనే సరైన అర్హుడు.
 
 ఇప్పటికే ప్రధాని కార్యాలయానికి మా లేఖను పంపాం’ అని క్రీడా శాఖ కార్యదర్శి ప్రదీప్ దేబ్ తెలిపారు.  ఈనెల 12న ధ్యాన్‌చంద్ కుమారుడు అశోక్ కుమార్, మనవడు గౌరవ్ సింగ్, మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడిలతో కూడిన ఆరుగురి బృందం క్రీడా మంత్రి జితేంద్ర సింగ్‌ను కలిసి భారతరత్నకు ధ్యాన్‌చంద్ పేరును ప్రతిపాదించాలని కోరారు. 1979లో మరణించిన ధ్యాన్‌చంద్ 1928, 32, 36 ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు తన అసమాన ఆటతీరుతో స్వర్ణాలు అందించడమే కాకుండా ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో అత్యద్భుతమైన ఆటగాడిగా కీర్తించబడుతున్నారు.
 
 పూర్తి పేరు: ధ్యాన్‌చంద్ సింగ్
 జననం: 29 ఆగస్టు, 1905
 జన్మస్థలం: అలహాబాద్, ఉత్తరప్రదేశ్
 మరణం: 3 డిసెంబరు, 1979
 ఎత్తు: 5 అడుగుల 3 అంగుళాలు
 ఆడిన స్థానం: సెంటర్ ఫార్వర్డ్
 ప్లేయర్‌గా కెరీర్: 1926 నుంచి 1948 దాకా
 చేసిన గోల్స్: 1000కి పైగా
 
 ఘనతలు
 1928 అమ్‌స్టర్‌డామ్
 ఒలింపిక్స్‌లో స్వర్ణం
 1932 లాస్‌ఏంజిల్స్
 ఒలింపిక్స్‌లో స్వర్ణం
 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం
 
 ధ్యాన్‌చంద్ 16 ఏళ్ల ప్రాయంలో ఇండియన్ ఆర్మీలో చేరారు.1922 నుంచి 1926 వరకు కేవలం ఆర్మీలోని వివిధ రెజిమెంట్ల మధ్య జరిగిన టోర్నమెంట్లలో ఆయన పోటీపడ్డారు.ధ్యాన్‌చంద్ 1952లో ‘గోల్’ పేరుతో ఆత్మకథను రాశారు. 1956లో 51 ఏళ్ల వయస్సులో ఆయన మేజర్ హోదాలో ఆర్మీ నుంచి రిటైరయ్యారు. అదే ఏడాది భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. 2002లో ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ పేరిట జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రవేశపెట్టారు.
 
 ఆయనే అర్హుడు
 ‘సాక్షి’కి ప్రత్యేకం
 
 ముకేశ్ కుమార్
 ధ్యాన్‌చంద్ పేరును భారత క్రీడా మంత్రిత్వ శాఖ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కు సిఫారసు చేసిందని తెలియగానే హాకీ ప్రపంచం అంతా ఆనందంలో మునిగింది. ఇక ఆ పురస్కారం ఆయనను వరిస్తే దేశంలోని క్రీడాకారులంతా పండగ చేసుకోవాలి. క్రీడల పరంగా భారత్ పేరు ప్రపంచానికి తెలియడానికి కారణం ధ్యాన్‌చంద్. ఆయన పుట్టినరోజును మనం జాతీయ క్రీడాదినోత్సవం (ఆగస్టు 29)గా జరుపుకుంటున్నాం. జీవితంలో ఎప్పుడూ డబ్బు కోసం ఆడలేదు. దేశం కోసం, దేశ ప్రతిష్ట పెంచడం కోసమే ధ్యాన్ హాకీ ఆడారు. ఇప్పుడు నాకో సంఘటన గుర్తొస్తుంది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ధ్యాన్‌చంద్ విశ్వరూపం చూపించారు. ఆయన హాకీ ఆడుతున్న స్టిక్‌లో అయస్కాంతం ఉందేమో అని హిట్లర్ పరిశీలించారు. ‘మా దేశంలో ఉండిపో. ఆర్మీలో మేజర్ పదవి ఇస్తా’ అని స్వయంగా హిట్లర్ అడిగారు. కానీ ధ్యాన్‌చంద్ నిరాకరించారు. తనకు తన దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని, ప్రాణం ఉన్నంతవరకు భారత్‌కే హాకీ ఆడతానని స్పష్టం చేశారు.
 
 నిజమైన దేశభక్తుడు ఆయన. నిరంతరం ప్రాక్టీస్ చేసేవారు. అప్పట్లో ఒలింపిక్స్‌కి వెళ్లడానికి సముద్ర ప్రయాణం చేసేవాళ్లు. ఆ సమయంలో పది, పదిహేను రోజులు ఓడలో గడిపేవారు. ప్రయాణంలో ఓడలో కూడా డ్రిబ్లింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్లు. ఒక్క గంట కూడా సమయం వృథా చేసేవారు కాదు. మా రోజుల్లో హాకీ ఆడటం మొదలుపెట్టగానే అందరికీ ధ్యాన్‌చంద్ గురించి, ఆయన ప్రాక్టీస్ చేసే విధానం గురించి చెప్పేవాళ్లు. కాస్త ఆలస్యంగానైనా ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనపై సంతోషంగా ఉంది. ఆ అవార్డుకు అసలైన అర్హుడు ధ్యాన్‌చంద్.
 
  సచిన్ టెండూల్కర్, విశ్వనాథన్ ఆనంద్ కూడా భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారులు. వీరు కూడా భారతరత్నకు అర్హులే. కానీ వీళ్లు ఈ అవార్డు అందుకోవడానికి చాలా సమయం ఉంది. ముందు ధ్యాన్‌చంద్‌కే ఈ అవార్డు ఇవ్వాలి. ఒలింపియన్లందరిదీ ఇదే మాట. ఆయనకు అవార్డు ఇవ్వడం వల్ల జాతీయ క్రీడపై మరింత మందికి ఆసక్తి పెరుగుతుంది. చాలామందికి ఇది స్ఫూర్తినిస్తుంది.
 (రచయిత హాకీలో ట్రిపుల్ ఒలింపియన్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క క్రీడాకారుడు)
 

మరిన్ని వార్తలు