-

పాక్‌పై నిషేధం వద్దంటున్న డయానా

21 Feb, 2019 11:00 IST|Sakshi

ముంబై: ‘నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదు’ అనే పాట క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీవోఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీకి పక్కాగా సెట్‌ అవుతుంది. ఎందుకంటే అందరి నిర్ణయాలు ఒకలా ఉంటే ఆమె నిర్ణయాలు మరోలా ఉంటాయి. మహిళల క్రికెట్‌ కోచ్‌ వివాదం నుంచి  మిథాలీరాజ్‌ సారథ్య విషయంలో, రాహుల్‌-పాండ్యాలు వివాదస్పద వ్యాఖ్యల సందర్భాలలో డయానా ఎడ్డం అంటే తెడ్డం అన్నారు. తాజాగా మరో విషయంలోనూ అందరికీ వ్యతిరేకంగా నిలుచొని వార్తల్లో నిలిచారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో యావత్‌ భారత్‌.. పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగే మ్యాచ్‌ ఆడవద్దనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. రెండు పాయింట్లు పోయినా పర్లేదు కానీ.. ఉగ్రవాద ప్రేరేపిత దేశంతో ఆడే ముచ్చటే లేదని అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు. (పాక్‌తో ఆడకపోవడం న్యాయమైందే : కేంద్రమంత్రి)

ఈ క్రమంలో భారతీయుల మనోభావాల ప్రకారమే నడుచుకోవాలని బీసీసీఐ, సీవోఏ భావిస్తోంది. ప్రపంచకప్‌లో పాక్‌తో మనం ఆడకుండా ఉండే బదులు ఆజట్టునే ఆడకుండా చేయాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో పాక్‌ను నిషేదించాలని ఐసీసీకి లేఖ రాయాలని అధికారులు భావించారు. ఈ మేరకు సీవోఏ చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రితో లేఖ రాయించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రతిపాదనకు అందరూ సమ్మతం తెలపగా డయానా మాత్రం అడ్డుపడ్డారు. ప్రపంచకప్‌లో పాక్‌పై నిషేధం వద్దని, మరేదైనా ఆలోచిద్దామని సభ్యులతో విభేదించారు. మిగతా సభ్యులు ఎంత చెప్పిన డయానా వినకపోవడంతో శుక్రవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. భారత్‌ లేకుండా ప్రపంచ కప్‌లో ఐసీసీ ముందుకెళ్లలేదని దీంతో పాక్‌ను నిషేదించేలా ఒత్తిడి చేయాలని బీసీసీఐ అనకుంటున్న తరుణంలో ఎడుల్జీ నిర్ణయంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. (ఉగ్రదాడి: ధర్మశాలలో పాక్‌ క్రికెటర్ల ఫోటోలు తొలగింపు)

చదవండి: ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరిగేనా?

ఉగ్ర మారణహోమం

మరిన్ని వార్తలు