దినేశ్‌ కార్తీక్‌కే పగ్గాలు

4 Mar, 2018 10:37 IST|Sakshi
దినేశ్‌ కార్తీక్‌(ఫైల్‌ఫొటో)

కోల్‌కతా:ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేశారు. అనేక తర్జన భర్జనల తర్వాత దినేశ్‌ కార్తీక్‌ను సారథిగా ఎంపిక చేస్తూ కేకేఆర్‌ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దినేశ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయాన్ని కేకేఆర్‌ ఫ్రాంచైజీ ఆదివారం ప్రకటించింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా పనిచేసిన గౌతం గంభీర్‌ను వదిలేసుకున్న ఆ జట్టు.. ఈ సీజన్‌లో ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పాలి అనే దానిపై లోతుగా విశ్లేషించింది. ఈ  క్రమంలోనే కార్తీక్‌తో పాటు రాబిన్‌ ఉతప్ప,  సునీల్‌ నరైన్‌ల పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే దినేశ్‌ కార్తీక్‌నే సారథిగా నియమించడానికి కేకేఆర్‌ మొగ్గుచూపింది.

గత ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌కు ఆడిన దినేశ్‌ కార్తీక్‌.. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరి చివరి నెలలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో కార్తీక్‌కు రూ. 7.4 కోట్లు చెల్లించి కేకేఆర్‌ దక్కించుకుంది. గత సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌.. 14 మ్యాచ్‌ల్లో 361 పరుగులు నమోదు చేశాడు. మొత్తం 152 మ్యాచ్‌ల ఐపీఎల్‌ అనుభవం ఉన్న దినేశ్‌ కార్తీక్‌.. 2,903 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్‌ సెంచరీలున్నాయి. ఇతనొక నమ్మకదగిన బ్యాట్స్‌మన్‌ కావడంతో పాటు వికెట్‌ కీపర్‌గా కూడా ప్రభావం చూపే క్రికెటర్‌. దాంతో దినేశ్‌ కే జట్టు పగ్గాలు అప్పచెప్పేందుకు ఆసక్తికనబరించింది. ముందుగా ఆసీస్‌ విధ్వంసక ఆటగాడు క్రిస్‌ లిన్‌ను కెప్టెన్‌గా చేయాలని కేకేఆర్‌ భావించింది. అయితే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో క్రిస్‌ లిన్‌ గాయపడటంతో అతని పేరును పక్కన పెట్టింది. 

మరిన్ని వార్తలు