పంత్‌కు బాధ ఉంటుంది : దినేశ్‌ కార్తీక్‌

18 Apr, 2019 10:46 IST|Sakshi

కోల్‌కతా : ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోతే ఎవరికైనా బాధ ఉంటుందని, ఎప్పుడైనా కొందరికే అవకాశం దక్కుతుందని అది గేమ్‌ సహజత్వమని టీమిండియా వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ జట్టులో మహేంద్రసింగ్‌ ధోనికి బ్యాకప్‌ కీపర్‌ రిషభ్‌ పంతేనని దాదాపు కాయమనుకున్న పరిస్థితుల్లో అతన్ని కాదని సెలక్టర్లు కార్తీక్‌ వైపు మొగ్గుచూపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కార్తీక్‌ తొలిసారి నోరువిప్పాడు. భారత జట్టులో నా పునరాగమనంతో నా ప్రపంచకప్‌ ప్రయాణం మొదలైంది. ఏదైన ప్రత్యేకత కనబరిస్తే అవకాశం దక్కుతుందని నమ్మడం నేను మొదలెట్టాను. ప్రపంచకప్‌ జట్టులో భాగస్వామ్యం కావడం వర్ణించలేని అనుభూతి. జట్టులో కొందరికి అవకాశం దక్కితే మరికొందరికి దక్కదు. ఇది ఆట యొక్క సహజత్వం. కానీ మేం(పంత్‌,నేను) ఈ విషయం గురించి మాట్లాడవద్దు. అతనికి తన అవకాశాల గురించి అవగాహన ఉంది. ఒకవేళ అతను ఎంపికైతే..  నేను నిరాశ చెందేవాడిని. నేను సెలక్టయ్యాను. అతను కొంత బాధపడుతున్నాడు. పంత్‌ ప్రత్యేకమైన ఆటగాడు. అతను చాలా రోజులు క్రికెట్‌ ఆడుతాడని చెబుతున్నా. ధోనితో కలిసి ఆడుతున్నప్పుడు.. నేను పంత్‌తో ఎందుకు ఆడను? డ్రెస్సింగ్‌ రూం ఎందుకు పంచుకోను? భవిష్యత్తులో అది కూడా జరుగుతందని, ఇద్దరం కలసి ఆడుతాం’ అని కార్తీక్‌ చెప్పుకొచ్చాడు.

ఇక పంత్‌కు అప్పుడే ప్రపంచకప్‌ దారులు మూసుకుపోలేదు.  అంబటి రాయుడు, పంత్‌లు ప్రపంచకప్‌ కోసం స్టాండ్‌బైగా ఎంపికయ్యారు. ముగ్గురు బ్యాకప్‌ ఆటగాళ్లలో వీరితో పాటు పేసర్‌ నవదీప్‌ సైనీకి అవకాశం దక్కింది. ఇది వరకే ఎంపిక చేసిన భారత జట్టులో ఎవరైనా గాయపడితే ఈ ముగ్గురు ఇంగ్లండ్‌ విమానం ఎక్కుతారు. బ్యాట్స్‌మెన్‌ గాయపడితే మొదట ప్రాధాన్యం పంత్‌కు లభిస్తుంది. రెండో అవకాశం రాయుడికిచ్చారు. బౌలర్‌ గాయపడితే మాత్రం సైనీ ఇంగ్లండ్‌కు బయల్దేరతాడు. అక్కడున్న అవసరాన్ని బట్టి ఈ ముగ్గురిలో ఒక్కొక్కరు వెళ్లే చాన్స్‌ ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు