స్పందిస్తే చాలా సిల్లీగా ఉంటుంది: దినేశ్ కార్తీక్‌

22 Oct, 2019 18:45 IST|Sakshi

హైదరాబాద్‌: కాంట్రవర్సీస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కేరళ స్పీడస్టర్‌ శ్రీశాంత్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. గతంలో(బీసీసీఐ నిషేధం విధించక ముందు) టీమిండియాలో తనకు చోటు దక్కకపోవడానికి దినేశ్‌ కార్తీక్‌ కారణమంటూ శ్రీశాంత్‌ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఆసమయంలో కార్తీక్‌ టీమిండియా కెప్టెన్‌ కాదు, కనీసం అప్పటికీ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడు కూడా కాదు. ఈ క్రమంలో శ్రీశాంత్‌ను ఎంపిక కాకుండా కార్తీక్‌ అడ్డుకున్నాడన్న శ్రీశాంత్‌ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. అయితే తాజాగా శ్రీశాంత్‌ వ్యాఖ్యలపై దినేశ్‌ కార్తీక్‌ స్పందించాడు. ‘శ్రీశాంత్‌ నాపై చేసిన ఆరోపణల గురించి విన్నాను. అయితే ఈ ఆరోపణలపై స్పందించడం కూడా చాలా సిల్లీగా ఉంటుంది’అంటూ దినేశ్‌ కార్తీక్‌ సెటైరికల్‌గా సమాధానమిచ్చాడు. 

ఇక కొద్ది రోజుల క్రితం చెన్నై సూపర్‌కింగ్స్‌పై శ్రీశాంత్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌ మాజీ కోచ్‌ పాడీ ఆప్టన్‌ రాసుకున్న తన ఆత్మకథలో శ్రీశాంత్‌ గురించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు శ్రీశాంత్‌ను ఎంపిక చేయకపోవడంతో తనను అసభ్యంగా దూషించాడని ఆప్టన్‌ పేర్కొన్నాడు. అయితే దీనిపై స్పందించిన శ్రీశాంత్‌ తనకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ అంటే ఎంత అసహ్యమో అందరికీ తెలుసని, అయితే దానికి కారణం ధోని కాదని తెలిపాడు. తనకు పసుపు రంగు నచ్చదని అందుకే సీఎస్‌కేతో పాటు ఆస్ట్రేలియా జట్టు అంటే ఇష్టముండదని తెలిపాడు. అందుకే సీఎస్‌కేపై తప్పక ఆడించాలని మాత్రమే కోరానని ఎలాంటి దూషణలకు దిగలేదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఆప్టన్‌ వ్యాఖ్యలపై రాహుల్‌ ద్రవిడ్‌ తప్పక స్పందించాలని శ్రీశాంత్‌ కోరాడు. 

ఇక శ్రీశాంత్‌ కెరీర్‌ మొత్తం వివాదాలతోనే గడిచింది. దీంతో అతడు కింగ్‌ ఆఫ్‌ కాంట్రవర్సీస్‌గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు అతడి జీవితాన్నే తలికిందులు చేశాయి. శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిన శ్రీశాంత్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. లైఫ్‌ బ్యాన్‌ కాకుండా నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించింది. దీంతో నిషేధ కాలం వచ్చే ఏడాది సెప్టెంబర్‌తో ముగుస్తోంది. ఈ క్రమంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

మరిన్ని వార్తలు