దీపా కర్మాకర్‌కు ఖేల్‌రత్న అవార్డు?

17 Aug, 2016 16:11 IST|Sakshi
దీపా కర్మాకర్‌కు ఖేల్‌రత్న అవార్డు?

ఇప్పటివరకు జిమ్నాస్టిక్స్‌లో ఎక్కడా వినిపించని భారతదేశం పేరును తొలిసారి అంతర్జాతీయ యవనికపై గౌరవనీయమైన స్థానంలో నిలిపిన దీపా కర్మాకర్‌ పేరును ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదిస్తున్నారు. దేశంలో క్రీడారంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారం అయిన ఖేల్‌రత్నతో ఈ త్రిపుర జిమ్నాస్టును సత్కరించాలని క్రీడాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. జిమ్నాస్టిక్స్‌ అంశంలో దీపకు కొద్దిలో కాంస్యపతకం తప్పింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. దీపా కర్మాకర్‌తో పాటు షూటర్ జీతూరాయ్ కూడా ఖేల్ రత్నకు పోటీ పడుతున్నట్లు తెలిసింది.

అలాగే దీపకు చిన్నతనంలో శిక్షణ ఇచ్చిన కోచ్ బిశ్వేశ్వర్ నందికి ద్రోణాచార్య అవార్డు దక్కే అవకాశం కనిపిస్తోంది. స్పాన్సర్ చేసేవాళ్లు ఎవరూ లేకపోయినా, సదుపాయాలు శూన్యమైనా.. పేదరికాన్ని సైతం తోసిరాజని దీప తన నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించింది. ప్రధానంగా అత్యంత ప్రమాదకరమైన ప్రోదునోవా విభాగంలో ఆమె ప్రతిభ అద్భుతమని క్రీడా పండితులు అంటారు. 2010లో కామన్‌వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు జిమ్నోవా అనే సంస్థ ఆమెకు జిమ్నాస్టిక్స్ దుస్తులు ఇచ్చింది. గత మూడు నెలల క్రితం వరకు ఆమె అవే దుస్తులను ఉపయోగించిందంటే ఆమె ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. అయితే.. ఏప్రిల్‌లో జరిగిన రియో టెస్ట్ ఈవెంట్‌లో ఆమె క్వాలిఫై కావడంతో ఒక్కసారిగా ఆమెకు గుర్తింపు వెల్లువెత్తింది. స్పాన్సర్లు కూడా ఆమెవెంట పడ్డారు.

ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలోనే నిలిచినా, దీప భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చిందంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమెను ప్రశంసించారు. దాంతో ఇప్పుడు ఆమె పేరును ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదించాలని భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు