మన 'దీపం' వెలిగింది

9 Aug, 2016 02:32 IST|Sakshi
మన 'దీపం' వెలిగింది

ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్‌కు అర్హత
వాల్ట్ ఈవెంట్‌లో సత్తా చాటిన కర్మాకర్ 
ఈ నెల 14న ఫైనల్స్

భారత జిమ్నాస్టిక్స్‌ను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తూ ఒలింపిక్స్‌కు తీసుకెళ్లిన దీపా కర్మాకర్.... తన మీద ఉన్న భారీ అంచనాలను అందుకుంటూ... పతక అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. రియోలో పతకం కచ్చితంగా సాధిస్తారని భావించిన వారు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతుండగా... దీపా మాత్రం మొక్కవోని దీక్షతో పోరాడింది. తనకు అత్యంత ఇష్టమైన, పట్టు ఉన్న వాల్ట్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరి భారత శిబిరంలో ఆశలు పెంచింది.

 రియో : తన 23వ పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు దీపా కర్మాకర్ మరోసారి దేశం గర్వించే ప్రదర్శనను కనబర్చింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇప్పటికే రికార్డు అందుకున్న ఆమె తనపై దేశం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టింది. ఆదివారం జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్‌లో దీప ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యింది. తద్వారా తొలి ప్రయత్నంలో ఫైనల్‌కు చేరిన మరో ఘనతను అందుకుంది. మొత్తం 14.850 పాయింట్లతో ఆమె ఎనిమిదో స్థానంలో నిలవడం విశేషం. క్వాలిఫయింగ్ పోటీల్లో అమెరికా స్టార్ సైమన్ బైల్స్ అగ్రస్థానంలో (16.050 పాయింట్లు) నిలిచింది.

ఇతర ఈవెంట్‌లలో 11.666 (అన్ ఈవెన్ బార్స్), 12.866 (బ్యాలెన్సింగ్ బీమ్), ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ (12.033) స్కోరు చేసిన దీప, ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో ఆమెపై పెనాల్టీ కూడా పడింది. ఆల్‌రౌండ్ జాబితాలో 51.665 పాయింట్లతో 47వ స్థానంతో సరి పెట్టుకున్న ఆమె... తన ప్రధాన ఈవెంట్ వాల్ట్‌లో మాత్రం అంచనాలను అందుకుంది. ‘ఇవి నా తొలి ఒలింపిక్స్. ఫైనల్‌కు చేరడం చాలా గొప్పగా అనిపిస్తోంది. హాల్‌లో విపరీతమైన గోలతో నేను మ్యూజిక్‌ను కూడా సరిగా వినలేకపోయాను. పాయింట్లు ఇచ్చే విషయంలో జడ్జిలు కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు నాకనిపిస్తోంది. నా ప్రదర్శన సంతృప్తినిచ్చినా ఇంతకంటే ఇంకా బాగా చేయాల్సింది’ అని దీపా కర్మాకర్ వ్యాఖ్యానించింది.

 కోచ్ ఉద్వేగం...
ఒలింపిక్స్‌లో దీప ప్రదర్శన పట్ల ఆమె కోచ్ విశ్వేశ్వర్ నంది గర్వపడుతున్నాడు. అయితే అదే సమయంలో తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘వంద కోట్ల మంది భారతీయుల ఆశలను ఆమె మోస్తోంది. దేశంలో ప్రతీ ఒక్కరు దీప పతకం గెలిచి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నారు. అది ఎంత కష్టమో చాలా మందికి తెలీదు. 0.001 పాయింట్ తేడాతో మెడల్ కోల్పోయే అవకాశం ఇక్కడ ఉంది. ఇంత ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు’ అని విశ్వేశ్వర్ వ్యాఖ్యానించారు. దీప కెరీర్ ఆరంభంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆయన సొంత తెలివితేటలు ఉపయోగించి పాత సెకండ్ హ్యాండ్ స్కూటర్ విడి భాగాలు, తుక్కు సామాను ఉపయోగించి ప్రాక్టీస్‌కు కావాల్సిన స్ప్రింగ్ బోర్డు, వాల్ట్ తదితర పరికరాలను తయారు చేసిన రోజులు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం తనను కనీసం ఎవరూ గుర్తు పట్టలేకపోయేవారని, ఇప్పుడు దీప కారణంగా ఒక్కసారిగా అందరికీ తెలిసినట్లు విశ్వేశ్వర్ ఉద్వేగంగా చెప్పారు.

 ప్రపంచానికి దూరంగా...
ఆదివారం జరిగే ఫైనల్స్‌కు ముందు దీపా కర్మాకర్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండకుండా, ఇతర అంశాల వైపు ధ్యాస మళ్లకుండా కోచ్ విశ్వేశ్వర్ నంది అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం నాలుగేసి గంటల పాటు సాధన తప్ప ఆమెకు మరో ప్రపంచం ఉండరాదని ఆయన భావిస్తున్నారు. మంగళవారం దీప పుట్టిన రోజున కూడా తల్లిదండ్రులతో తప్ప మరెవరితో మాట్లాడరాదని కూడా కోచ్ చెప్పేశారు. ‘ఆమె మొబైల్‌నుంచి సిమ్ కార్డు తీసేశాను. తల్లిదండ్రులతో మాత్రం మాట్లాడనిస్తాను. ఎలాగూ పెద్దగా స్నేహితులు కూడా లేరు. ఆదివారం ఆమె పతకం గెలుస్తుందని నాకు నమ్మకముంది. ఈవెంట్ ముగిసే సమయానికి భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 అవుతుంది. గెలిస్తే స్వాతంత్య్ర దినోత్సవం, పుట్టిన రోజు ఒకేసారి జరుపుకుంటాం’ అని విశ్వేశ్వర్ చెప్పారు.

 అంత సులభం కాదు...
దీపా కర్మాకర్ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ (వాల్ట్)లో ఫైనల్‌కు అర్హత సాధించిందనగానే మనందరిలో సహజమైన ఆనందం పొంగుకొచ్చేసింది. ఈ నెల 14న జరిగే ఫైనల్‌లో ఆమె మరింత బాగా ఆడి పతకం సాధించాలని కూడా కోరుకుంటున్నాం. మొత్తం నాలుగు ఈవెంట్‌లలో పాల్గొన్న ఆమె, మూడు విభాగాలు అన్ ఈవెన్ బార్స్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, బీమ్‌లలో విఫలమైంది. వాల్ట్ ఈవెంట్‌లో మాత్రం సత్తా చాటి ముందుకు దూసుకుపోయింది. అసలు ఈ వాల్ట్ ఎలా ఉంటుంది, ఇందులో పాయింట్లు ఎలా ఇస్తారంటే...

ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో వాల్ట్ ఒక ఈవెంట్. పోటీల కోసం వాల్టింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. జిమ్నాస్ట్‌లు రన్‌వేపై పరుగెత్తుకు వచ్చి స్ప్రింగ్ బోర్డు ఆధారంగా పైకి లేస్తారు. అదే ఊపులో వాల్ట్‌పై రెండు చేతులు ఉంచి (ప్రి ఫ్లయిట్) ఆ తర్వాత గాల్లో పల్టీలు కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత జిమ్నాస్ట్ టేబుల్ ఇదే విభాగంలో భాగమైన యుర్చెంకోలో అయితే స్ప్రింగ్ బోర్డుపై వెళ్లక ముందు కూడా మ్యాట్‌పై చేతులు ఉంచాలి. వాల్ట్‌పైనుంచి పల్టీలు కొడుతూ సరైన విధం గా మ్యాట్‌పై నిలవాలి. గాల్లో లేచినప్పుడు సులభంగానే అనిపించినా పల్టీలు కొట్టే సమయంలో జిమ్నాస్ట్‌కు చాలా నియంత్రణ ఉండాలి. వాల్ట్‌లోనే వేర్వేరు స్టైల్‌లు ఉంటాయి. హ్యండ్‌స్ప్రింగ్, యమషిత, సుకహారా, యుర్చెంకో, ఖోర్కినా అంశాలలో జిమ్నాస్ట్‌లు ప్రదర్శన ఇస్తారు.

పాయింట్లు ఎలా ఇస్తారంటే...
ఎలాంటి గందరగోళం, తడబాటు లేకుండా మ్యాట్‌పై చూపించిన ల్యాండింగ్ జోన్‌లో వాలడాన్ని బట్టే పాయింట్లు ఉంటాయి. ప్రతీ వాల్ట్‌కు నిర్ణీత పాయింట్లు కేటాయిస్తారు. దానిని పూర్తి  చేస్తే ఆ పాయింట్లే లభిస్తాయి.  పడిపోవడం, సరిగ్గా నిలబడలేకపోతే పాయింట్లు పోతాయి. జడ్జీలు ప్రధానంగా నాలుగు అంశాలు ప్రి ఫ్లయిట్, సపోర్ట్, ఆఫ్టర్ ఫ్లయిట్, ల్యాండింగ్‌లపై దృష్టి పెట్టి పాయింట్లు ఇస్తారు. వేగంగా సాగిపోయే ఈ ఆటలో జిమ్నాస్ట్‌ల మధ్య సాధారణంగా 0.2 పాయింట్ల తేడా మాత్రం ఉంటుంది. 2005నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం కష్టమైన అంశాలకు ఎక్కువ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఫ్లిప్పింగ్, ట్విస్టింగ్, టర్నింగ్ తదితర ఎనిమిది అంశాలు ఎలా చేశారనేదానిపై పాయింట్లు ఆధారపడి ఉంటాయి.

దీప ఏం చేసింది...
వాల్ట్‌లో దీప మొత్తం 14.850 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మొదటి ప్రయత్నంలో డిఫికల్టీలో 7 పాయింట్లు స్కోర్ చేసిన ఆమె, ఎగ్జిక్యూషన్‌లో 8.1 పాయింట్లు సాధించింది. ఆమెకు ఎక్కువ పాయింట్లు అందించడంలో ప్రొడునోవా ఈవెంట్‌దే కీలక పాత్ర.

ఎగ్జిక్యూషన్ స్కోర్
ఎలా చేశారనే దాని ఆధారంగా పాయింట్లు వస్తాయి. బేస్ స్కోర్ 10 ఉంటే... ఫాల్స్, తడబాటు, మధ్యలో ఆగిపోవడం వంటివి చూసి జడ్జిలు పాయింట్లు తగ్గిస్తారు. ఈ ప్రక్రియను ఎగ్జిక్యూషన్ స్కోర్ అంటారు.

డిఫికల్టీ స్కోర్
ఎంత కష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియను ఎంత బాగా చేశారనేదాన్ని బట్టి డిఫికల్టీ స్కోరు లభిస్తుంది. గరిష్ట డిఫికల్టీ స్కోరు అని ఏమీ ఉండదు.

ప్రొడునోవా:  ప్రాణాలకే ప్రమాదకర విన్యాసం
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో ఇది అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన  ఈవెంట్. ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్‌తో పాటు రెండు ఫ్రంట్ సోమర్ సాల్ట్‌లు కలిసి ఉంటాయి. దీని ప్రస్తుత డిఫికల్టీ స్కోరు 7. ఎక్కువ పాయింట్లు సాధించడం కోసం ఈ ప్రమాదకరమైన అంశాన్ని కొంత మంది జిమ్నాస్ట్‌లు  ఎంచుకుంటారు. దీపా కూడా అదే చేసింది.  ఓవరాల్‌గా కూడా ప్రొడునోవాను ప్రపంచంలో ఐదుగురు మాత్రమే పర్‌ఫెక్ట్‌గా పూర్తి చేయగలిగినవారిలో దీప కూడా ఉంది.  1980 ఒలింపిక్స్ మొదలు ఇప్పటి వరకు చాలా మంది ఈ సాహసం చేయబోయే తీవ్ర గాయాల పాలై, చావుకు దగ్గరగా వెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి. దీనితో ఈ అంశాన్ని నిషేధించాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆదివారం పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా జిమ్నాస్ట్ దిగ్గజం సైమన్ బైల్స్ కూడా గతంలో ‘నేను చనిపోవడానికి ప్రయత్నించను’ అని దీని గురించి వ్యాఖ్యానించింది. రియోలో కూడా ఆమె దీనికి దూరంగానే ఉంది.

మరిన్ని వార్తలు