రాజస్తాన్‌ రాయల్స్‌ కథ ముగిసె..

4 May, 2019 19:27 IST|Sakshi

ఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కథ ముగిసింది.  ఏదో మూలన మిగిలి ఉన్న ప్లేఆఫ్‌ ఆశలను రాజస్తాన్‌ రాయల్స్‌ సజీవంగా ఉంచుకోలేకపోయింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలై రేసు నుంచి నిష్క్రమించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంకా 23 బంతులు ఉండగానే ఛేదించడంతో రాజస్తాన్‌ కథ ముగిసింది. ఇది ఢిల్లీకి తొమ్మిదో విజయం కాగా, రాజస్తాన్‌కు ఎనిమిదో ఓటమి.  ఢిల్లీ విజయంలో రిషభ్‌ పంత్‌(53 నాటౌట్‌; 38 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలక భూమిక పోషించాడు.

స్వల్ప పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడింది. పృథ్వీ షా(8), శిఖర్‌ ధావన్‌(16)లు తొందరగానే పెవిలియన్‌ చేరారు. వీరిద్దర్నీ ఇష్‌ సోథీ వరుస బంతుల్లో ఔట్‌ చేయడంతో ఢిల్లీ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో శ్రేయస్‌ అయ్యర్‌-రిషభ్‌ పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరు 33 పరుగులు జత చేసిన తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌(15) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. కాసేపటికి ఇన్‌గ్రామ్‌(12) కూడా ఔట్‌ కావడంతో మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లి బాధ్యతను రిషభ్‌ తీసుకున్నాడు. ఒకవైపు క్రీజ్‌లో నిలకడగా ఆడుతూనే అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాట్‌ ఝుళిపించాడు. రిషభ్‌ మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ 16.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రహనే, లివింగ్‌ స్టోన్‌లు ఆదిలోనే పెవిలియన్‌ చేరారు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానే ఔట్‌ కాగా, ఇషాంత్‌ శర్మ వేసిన మరుసటి ఓవర్‌లో లివింగ్‌ స్టోన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది రాజస్తాన్‌. ఆపై వెంటనే సంజూ శాంసన్‌ రనౌట్‌ కావడంతో పాటు, లామ్రోర్‌ కూడా పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ దశలో రియన్‌ పరాగ్‌ బాధ్యాయుతంగా ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి బంతి వరకూ క్రీజ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రియాన్‌ పరాగ్‌(50; 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత​ శర్మ, అమిత్‌ మిశ్రాలు తలో మూడు వికెట్లు సాధించగా, ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు తీశాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు